సిద్దిపేట, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ మూకలపై గజ్వేల్ గడ్డ గర్జించింది. కేసీఆర్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా హెచ్చరించారు. గజ్వేల్‌లోని కేసీఆర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై మూడు రోజుల క్రితం కాంగ్రె స్ నాయకులు చేసిన దాడికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు సహా సబ్బండ వర్ణాలు స్వచ్ఛందంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రయాణికులు ఇబ్బందులకు గురికావొద్దని కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ ఆర్టీసీ డిపో నుంచి ప్రజ్ఞాపూర్ చౌరస్తా మీదుగా ప్రధాన వీధుల గుండా బీఆర్ఎస్ శ్రేణులు భా రీ బైక్ ర్యాలీ తీశారు. దారిపొడవునా ఎటుచూసినా గులాబీ జెండాలు కనిపించగా, కేసీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మూ కలను ఎక్కడికక్కడ తరిమికొడుతాం, కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
బంద్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర
గజ్వేల్‌లో శాంతియుతంగా కొనసాగుతున్న బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసినా అవి ఫలించలేదు. ఉదయం పది గంటల సమయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తన పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీస్‌స్టేషన్ ముందునుంచి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు బయటకు రావద్దని సూచించారు. అదే మార్గంలో ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్‌కు అనుకూల నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని ఆంక్షారెడ్డిని ఇంటికి పంపిన పోలీసులు.. ఆ మార్గంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే మార్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి భారీగా తరలివెళ్తుండటంతో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు పహారా కాశారు.
27నెలల కాంగ్రెస్ పాలనలో చేసిందేమిటి?
గజ్వేల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేకపోగా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కనీసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదని, కుట్ర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ గజ్వేల్‌ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి పని చేయలేదని ఎండగట్టారు. నాడు తాగు, సాగునీళ్ల కోసం తండ్లాడిన ఈ గడ్డ.. కేసీఆర్ పుణ్యమా అని ఆ గట్టెక్కింది. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిన ఈ ప్రాంతానికి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా కాళేశ్వరం జలాలను పారించింది. బీడు భూములను సస్యశ్యామలమై రైతులు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కనిపించని కక్షలు, వసూళ్లు, కేసులు.. కాంగ్రెస్ 27నెలల పాలనలో మితిమీరిపోయాయి. రాజకీయ చైతన్యం కల్గిన గజ్వేల్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లోనూ బుద్ధి చెబుతుంది’ అని తేల్చిచెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ : వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 6 : సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విరుచుకుపడ్డారు. సోమవారం గజ్వేల్ బంద్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను వెనుకేసుకొస్తున్న రేవంత్‌రెడ్డి.. బేషరతుగా కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్‌లో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం ఎదురవడంతో ప్రజల్లో ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులు, బెదిరింపులు, గూండాయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధిచెబుతారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గజ్వేల్ బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ప్రతాప్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.