హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పోరాటాలు, ఉద్యమాలు నడిపిన వీరులకు గుర్తింపు దక్కలేదుగానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురంభీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న వంటి వారికి గౌరవం, గుర్తింపు దక్కాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. నిజాం నవాబ్, దొరలు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు, పోరాటాలు చేసిన పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండలం మెరుగోనిపల్లె గ్రామానికి చెందిన పండుగ సాయన్నకు ప్రభుత్వం గుర్తింపు కల్పించి, ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై మండలిలో ప్రస్తావించిన బండా ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చే శారు. 1840-1900 మధ్యకాలానికి చెందిన సాయన్నకు పేదలకు సాయం చేసే వ్యక్తిగా గుర్తింపు ఉన్నా ఆధిపత్యవర్గాలు ఆయనను బందిపోటుగా చిత్రీకరించాయని పేర్కొన్నారు. నిరంకుశ నిజాం అధికారాలు, అధికారులను ప్రశ్నించి ఎదిరించి సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించుకొనే ప్రయత్నంలో సాయన్న ఉండగా, దేశముఖ్‌లు, భూస్వాములు, దొరలు నిజాం సర్కార్‌తో ఆయనను చంపించాయని వివరించారు. మహాయోధుడైన సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రస్తుతం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతున్నాయని, రాష్ట్రప్రభుత్వం అధికారికంగా వాటిని నిర్వహించి ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): అధికారం చేపట్టి రెండేండ్లు ముగిసినా ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడతో కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగం ఐఎన్టీయూసీ నేతలు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) ఈనెల 9న చలో బస్ భవన్‌కు పిలుపునిచింది. యూనియన్లను పునరుద్ధరణ చేయాలని, 2021, 2025 వేతన సవరణలను అమలుచేసి, కార్మికుల విలీన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్‌తో ఆందోళన చేపడుతున్నట్టు స్పష్టంచేసింది. కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి పిలుపునిచ్చారు. చలో బస్‌భవన్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.