నార్కట్పల్లి, జనవరి 20 : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం ఎందుకని, రైతుల పక్షాన పోరాడేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను, రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తున్నదని అన్నారు. ఏదేమైనా నల్లగొండ జిల్లా కేంద్రంలో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా చేస్తామని, ప్రభుత్వ తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాడే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతుబంధు సమతి మండల మాజీ కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి పాల్గొన్నారు.