మొదట పోలవరం- బనకచర్ల అన్నారు. తర్వాత పోలవరం-నల్లమలసాగర్గా మార్చారు. ఇప్పుడు గోదావరి-కావేరి అనుసంధానం తెరపైకి తెచ్చారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని ఎత్తుకు పోవడానికి అనేక మారుపేర్లతో కుట్రరచన సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ముందు పెట్టి చంద్రబాబు ఆడిస్తున్న నీటి నాటకాలకు అంతే లేదు. పేరేదైనా.. మన నీళ్లను కొల్లగొట్టుకు పోవడమే అసలు లక్ష్యం. నీటిదోపిడీని అడ్డుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం.. దొంగలకు సద్దులు కట్టడంలో నిమగ్నమవడమే మహా విషాదం.
ఒక దొంగ ఏదైనా ఇంటిని దోచుకునే ముందు ఏం చేస్తాడు? రెక్కీ నిర్వహిస్తాడు. ఆ ఇంటి యజమాని ఎవరు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ల దినచర్య ఏమిటి? అన్న విషయాలను గమనిస్తాడు. ఎవరూలేని సమయంలో దోపిడీకి ప్లాన్ చేస్తాడు. లోపలికి వెళ్లడానికి, తన పని కానిచ్చేందుకు రెండుమూడు ఆప్షన్లు ఎంచుకుంటాడు. అవసరమైతే ఇంకో దొంగ సాయం తీసుకుంటాడు. ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నవాళ్లలో ఒకరు దోపిడీకి సహకరిస్తే? దొంగ పని సులభం అవుతుంది కదా.
గోదావరి జలాల విషయంలో ఇలాంటి కుతంత్రమే జరుగుతున్నది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన అచ్చం ఇలాగే ఉన్నది. తెలంగాణకు దక్కాల్సిన 200 టీఎంసీల నీటిని ఎలాగైనా తన రాష్ర్టానికి దోచుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండటంతో ఆయన పప్పులు ఉడకలేదు.
కానీ ఇప్పుడు అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని మరో రూపంలో పంజా విసురుతున్నారు. తనపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తోడు తీసుకున్నారు. ఇంటి దొంగ తరహాలో రేవంత్ ప్రభుత్వం సైతం అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో అంతా కలిసి తెలంగాణ జలహక్కులకు తీరని ద్రోహం చేస్తున్నారు.
(గుండాల కృష్ణ-మ్యాకం రవికుమార్)
హైదారాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించిన ఈ ప్రాంత బద్ధ వ్యతిరేకి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. 2014లో ఏడు మండలాలను ఏపీలో కలుపనిదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని భీష్మించుకు కూర్చొని, తీరని అన్యాయం చేసిన వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణకు హక్కుగా రావాల్సిన నదీజలాలపై కన్నేశారు. అప్పుడు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉండటంతో అతడి పప్పులు ఉడకలేదు. అయినా తెలంగాణపై కుట్రలు ఆపలేదు. రాష్ట్ర రైతుల కడగండ్లు తీర్చేందుకు కేసీఆర్ చేపట్టిన భగీరథ యజ్ఞానికి ఐదేండ్లపాటు అవాంతరాలు కలిగిస్తూ, కాళ్లల్లో కట్టెలు పెట్టారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఇలా ఒకటేమిటి! చివరకు ఉమ్మడి రాష్ట్రంలో తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టుపైనా విషం చిమ్మి కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఘనుడు.
అలాంటి వ్యక్తి గత రెండేండ్లుగా మాట మార్చారు. తెలంగాణ ప్రాజెక్టులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ‘నేను కాళేశ్వరాన్ని వ్యతిరేకించలేదు, పాలమూరు-రంగారెడ్డికి అభ్యంతరం చెప్పను’ అంటూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంతకాలం తెలంగాణ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై కుట్రలు పన్ని, కృష్ణాజలాలను సీమాంధ్రకు దోచిపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి తెలంగాణ హక్కుజలాలపై పంజా విసిరేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? ‘నౌ ఆర్ నెవర్’ (ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు) అనే రీతిలో గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు పదేపదే ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? కొత్త ప్రతిపాదనలతో తెరమీదికి ఎందుకు వస్తున్నారు?
అక్కడే అసలు రహస్యం దాగి ఉన్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది చంద్రబాబు అనుకూల ప్రభుత్వం. అసలు కాంగ్రెస్‌ను మింగిన ‘పచ్చ కాంగ్రెస్’. అటు కేంద్రంలో తన మద్దతుతోనే నడుస్తున్న మోదీ ప్రభు త్వం. తెలంగాణ గోదావరి జలాల్ని శాశ్వతంగా కొల్లగొట్టేందుకు ఇంతకంటే మంచి తరుణం దొరకదని చంద్రబాబుకు తెలుసు. అందుకే కుట్రలకు తెరలేపుతున్నారు. మొద ట బనకచర్ల, తర్వాత నల్లమలసాగర్.. ఇప్పు డు కేంద్రం సంకలో చేరి గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు రూపంలో తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారు.
చంద్రబాబు నైజమే అది. తెలంగాణ రైతాంగాన్ని కుదురుగా ఉండనీయడు! ఈ ప్రాంత బీడు భూములకు సాగునీటిని దక్కనీయడు!! ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి వర్తమానంలో జరుగుతున్న కుతంత్రా ల వరకు జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. నమ్మకం కలుగడం లేదా? అయితే తెలంగాణ ఒడిలోని గోదావరి జలాల కుండను బద్దలుకొట్టి ఏపీకి తరలించుకుపోయేందుకు ఏయే రూపాల్లో వస్తున్నాడో.. ఇక్కడి రేవంత్ ప్రభుత్వం ఎట్లా నిద్ర నటిస్తున్నదో.. పచ్చ మీడియా తమ లీకులతో బాబు కుట్రలకు ఎలా ఆక్సీజన్‌ను అందిస్తున్నదో తెలియాలంటే ఈ కథనాన్ని చదవండి..

(కుట్ర -1 ) బాబు మస్తిష్కంలో నుంచి బనకచర్ల
దేశంలో ఎక్కడైనా నికర, మిగులు, వరద జలాలపై ప్రాజెక్టులు రూపొందించడం చూశాం. కానీ చరిత్రలోనే తొలిసారిగా ‘సముద్రంలో కలిసే నీళ్లు’ అంటూ చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. అదే పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు. తెలంగాణ జలాలను తరలించేందుకు బాబు ఎత్తిన మొదటి అవతారం ఇది. 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు రూ.81 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
పోలవరం కుడికాలువ, తాడిపూడి కాలువలు సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టా, ప్రకాశం బరాజ్‌కు తరలించడం, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించి పల్నాడు ప్రాంతానికి తాగు, సాగునీరు అందించడం, ఆపై బనకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ దాకా గోదావరి జలాలను తరలించి రాయలసీమకు చేర్చడమే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణకు దక్కాల్సిన జలాలను తరలించే ఈ కుట్రను బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ ముందుగానే గుర్తించాయి. పెద్దఎత్తున పోరాడి, రాష్ర్టానికి పొంచి ఉన్న ముప్పుపై తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం చేశాయి. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. దీన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు ఏకంగా ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్ను కేంద్రానికి సమర్పించినట్టు ప్రకటించేశారు. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే టెండర్లను సైతం పిలిచారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనలేదు.
చివరకు తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో తప్పని పరిస్థితుల్లో ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తంచేయడం మొదలుపెట్టింది. ఆ ఫిర్యాదులతో కేంద్ర సంస్థలైన ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏ, కో బేసిన్ రాష్ర్టాలు కూడా ఏపీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలిపాయి. తెలంగాణ పోరాటానికి చివరకు కేంద్రం కూడా స్పందించాల్సి వచ్చింది. పోలవరం-బనకచర్ల ప్రతిపాదనలు కేవలం పరిశీలనలోనే ఉన్నాయి తప్ప అనుమతులు ఇవ్వలేదని కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కింది. దీంతో చంద్రబాబు తన ప్లాన్ మార్చారు. రాజీ మంత్రం జపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రతిపాదనను నిర్దందం గా తిరస్కరించాల్సింది పోయి.. పరస్పరం కూర్చొని మాట్లాడుకుందాం! అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీంతో మరోసారి తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్లేటు పిరాయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి, చంద్రబాబు ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోతానని హామీ ఇచ్చినా, అది కార్యరూపం దాల్చలేదు. చివరికి ‘గోదావరి-బనకచర్ల’ పాచిక పారేలాలేదని అర్థమై చంద్రబాబు వెనక్కి తగ్గారు.
(కుట్ర -2) పేరు మార్చి.. నల్లమలసాగర్ రూపం
బనకచర్ల ప్లాన్ విఫలం కాగానే చంద్రబాబు మరో కొత్త కుతంత్రం పన్నారు. తిమ్మిని బమ్మి చేసి, తెలంగాణను దగా చేయడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి అనేది బహిరంగ రహస్యం. రెండో కుట్రలో భాగంగా రూ.59 వేల కోట్లతో ‘పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు’ అంటూ మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇదీ బనకచర్ల లాంటిదే. గోదావరి జలాలను పోలవరం నుంచి కుడికాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి రెండు దశల్లో నల్లమలసాగర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.
ఏ రాయితో కొట్టుకుంటే ఏంది?! అన్నట్టుగా బనకచర్ల అయినా, నల్లమలసాగర్ అయినా… రెండూ 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలనేదే చంద్రబాబు స్కెచ్. ఈ కుట్రను బీఆర్ఎస్ మొదట్లోనే గుర్తించింది. నల్లమలసాగర్‌పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పేరుకు నల్లమలసాగర్ అయినా దాని అసలురూపం బనకచర్లనే అని, తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్ర అని వాస్తవాలను ప్రజల ముందుంచింది. దీంతో చంద్రబాబు రూటు మార్చారు. బనకచర్ల మాదిరిగా నేరుగా తానే రంగంలోకి దిగితే విఫలమయ్యే ప్రమాదం ఉన్నదని గ్రహించి, తన మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపారు. మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు.
బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు ఈ సమావేశం ఎజెండాలోనే లేదని, ఒకవేళ అలా ఉంటే భేటీకే హాజరుకామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీరాలు పలికింది. చివరికి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి, కేవలం ఏపీ గోదావరి జలాలపైనే చర్చించారు. కేంద్రం ప్రతిపాదించిన ఉమ్మడి కమిటీకి అంగీకరించి సంతకం చేసి వచ్చారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ‘కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించి విజయం సాధించాం’ అని ప్రకటించుకున్నారు. కానీ నేటికీ అవి అతీగతీ లేవు. కానీ చంద్రబాబు మాత్రం ఢిల్లీలో చక్రం తిప్పి, ఉమ్మడి కమిటీకి ఏపీ తరఫున ఇంజినీర్ల పేర్లు పంపించడమే కాకుండా తెలంగాణ నుంచి సైతం పేర్లు ప్రతిపాదించేలా పావులు కదిపారు. అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బనకచర్ల/నల్లమలసాగర్‌ను వ్యతిరేకిస్తున్నామని బయటికి చెప్తున్నా, అంతర్గతంగా సహకరిస్తున్నదని తేలిపోయిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వేసిన కమిటీకి పేర్లు పంపడమే ఇందుకు నిదర్శనమన్నారు.

(కుట్ర -3) కేంద్రంతో కలిసి గుంపు దాడి
బనకచర్ల, నల్లమలసాగర్.. ఇలా రెండు రూపాల్లోనూ చేసిన ప్రయత్నాలు సఫలం కావడం లేదని చంద్రబాబుకు అర్థమైంది. 200 టీఎంసీల జలాలను అక్రమంగా తరలించుకుపోయే కుట్రలపై తెలంగాణలో ఎగిసిపడుతున్న వ్యతిరేకతను చూసిన చంద్రబాబు తన ప్లాన్ మార్చేశారు. ముచ్చటగా మూడో కుట్రకు తెరలేపారు. ఈసారి సొంతంగా కాకుండా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ గోదావరి జలాలకు గురిపెట్టారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. దానికి చారిత్రక నేపథ్యం ఉన్నది. హిమానీ నదుల్లో (హిమాలయ పర్వతాల్లో పుట్టినవి) ఉన్న భారీ మిగులు జలాలను దక్షిణాదిలో నీటికొరత ఉన్న నదుల్లోకి తరలించడం ద్వారా దుర్భిక్ష ప్రాంతాలకు మేలు చేయాలనేది వాజ్‌పేయి హయాంలో రూపొందించిన బృహత్తర కార్యాచరణ. ఇందులో భాగంగానే గోదావరి-కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించారు. అయితే ముందుగా మహానది నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాలని, ఆ తర్వాత గోదావరి-కావేరి నదులను అనుసంధానించాలని నిర్ణయించారు. కానీ మహానదిలో మిగులు జలాలు లేవని ఒడిశా తేల్చి చెప్పడంతో అనుసంధాన ప్రాజెక్టులను కేంద్రం అటకెక్కించింది. తర్వాత తమిళనాడు ఎన్నికల్లో లబ్ధికోసం మోదీ ప్రభుత్వం గోదావరి జలాలను ఆ రాష్ర్టానికి తరలించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. గోదావరిలో మిగులు జలాల లెక్కను శాస్త్రీయంగా తేల్చిన తర్వాతే, ఈ ప్రాంత ప్రయోజనాలు తీరిన తర్వాతే, మిగిలిన జలాలను తరలించాలని స్పష్టంచేసింది.
దీంతో కేంద్రం పప్పులు ఉడకలేదు. తమిళనాట ఎన్నికల తంతు ముగియడంతో బీజేపీకి రాజకీయంగా ఈ ప్రాజెక్టుపై పెద్ద ఆసక్తి లేకపోయింది. అయినా తాజాగా చంద్రబాబు ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును తెలంగాణ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నది. ఇక్కడ కూడా చంద్రబాబు తన చాణక్యం ప్రదర్శించారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా సమ్మక్క బరాజ్-నాగార్జునసాగర్, పోలవరం-నల్లమలసాగర్ ద్వారా కావేరికి గోదావరి జలాల తరలింపును తెరమీదికి తెచ్చారు. అంటే పైకి గోదావరి-కావేరి అనుసంధానంగా కనిపించినా, అంతర్భాగంగా నల్లమలసాగర్ అలియాస్ బనకచర్లను కేంద్ర నిధులతోనే పూర్తిచేసి, తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోవాలనేది చంద్రబాబు రచించిన అసలు ప్రణాళిక. తాను ఒంటరిగా తెరపై కనిపిస్తే పాచిక పారదని గుర్తించి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి తీసుకొచ్చారు. కేంద్ర జలసంస్థలోని ఓ అంధ్రా అధికారి ద్వారా చంద్రబాబు ఈ కథను నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

(కుట్ర -4) పాలమూరు-రంగారెడ్డిని ఎరగా చూపి..
నేరుగా తాను రంగంలోకి దిగినా, కేంద్రంతో కలిసి ఒత్తిడి చేసినా తెలంగాణ సమాజం బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులపై పోరాటం చేస్తుండటంతో చంద్రబాబు మరోసారి తన కుట్రబుద్ధికి పదును పెట్టారు. గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ఈసారి ఏకంగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారని సాగునీటిరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పావుగా వాడుకుంటున్నట్టు చెప్తున్నారు. రెండున్నరేండ్లుగా పాలమూరు ప్రాజెక్టు పనులను పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రాజెక్టుపై దృష్టి సారించినట్టు నాటకీయ పరిణామాలను సృష్టించడం చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనన్న ఆరోపణలు ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కి పంపినా కిక్కురుమనలేదని గుర్తు చేస్తున్నారు. అలాంటిది కొంతకాలం కిందట కొత్తగా అనుమతుల నాటకాన్ని తెరపైకి తెచ్చిందని గుర్తు చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్లో పొదుపుగా చూపిన 45 టీఎంసీలకు మొదటి దశ కింద అనుమతినివ్వాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై లోతుగా ఆరా తీయగా… కేంద్ర జల సంఘం ఛైర్మన్ హైదరాబాద్‌కు వచ్చినపుడు జరిగిన చర్చల్లో, ఆయన సూచన మేరకే మంత్రి ఉత్తమ్ ఈ లేఖ రాశారని తేలింది.
అంటే పాలమూరు ప్రాజెక్టుకు రెండు దశల్లో నీటి అనుమతులు ఇచ్చే ప్రణాళికను కొన్ని నెలల కిందటే రూపొందించారని అర్థమవుతుంది. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు కావాలంటే గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు, అందులో అంతర్భాగంగా చేపట్టే నల్లమలసాగర్ (బనకచర్ల)కు తెలంగాణ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధిస్తున్నది. దానినే పచ్చ పత్రికలు లీకుల రూపంలో కథనాలు ప్రచురిస్తున్నాయి. పైగా ఆ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏమంటున్నదో మాత్రం చెప్పవు. కథనం ప్రచురించే ముందు ప్రభుత్వ పెద్దలకు ఒక్క కాల్చేసి, తెలంగాణ అభిప్రాయాన్ని కూడా జోడించవచ్చు. కానీ అలా చేయరు.. ఎందుకంటే అవి లీకుల రూపంలో ఇచ్చే కవ్వింపు కథనాలు. వాటిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా స్పందించదు.
ఎవరి నీళ్లు… ఎవరి దయాదాక్షిణ్యాలు?
‘గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం) నుంచి 47 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ జలాశయానికి తరలిస్తారు. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. తెలంగాణలోని సమ్మక్క బరాజ్‌కు గోదావరి ట్రిబ్యునల్‌లో కేటాయింపులు లేవు. ఏ ఒప్పందాల్లోనూ లేదు. అయినా సమ్మక్క బరాజ్ దగ్గర 47 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వదులుకుంటున్నది కాబట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 43 టీఎంసీలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు’ మోదీ-చంద్రబాబు నేతృత్వంలోని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు తెలంగాణకు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇదట.
అసలు ఎవరి నీళ్లు? ఎవరి దయాదాక్షిణ్యాలు కావాలి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవాల్ని తొక్కి పెట్టి బ్లాక్మెయిల్ చేయడంపై మండిపడుతున్నారు. ఎందుకంటే? గోదావరి ట్రిబ్యునల్‌లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరుగలేదు. కేవలం ఇచ్చంపల్లికి 80 టీఎంసీలు మినహా ఉమ్మడి ఏపీలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు ప్రత్యేకంగా కేటాయింపులు లేవు. చివరకు పోలవరం ప్రాజెక్టుకు సైతం ఎఫ్ఆర్ఎల్ 150 అడుగులు అని మాత్రమే ఉన్నది తప్ప ఇన్ని టీఎంసీలు అన్న కేటాయింపు లేదు. కాబట్టి తెలంగాణకు హక్కుగా వచ్చే 968 టీఎంసీల గోదావరి జలాల్లో సమ్మక్క సాగర్‌కు 47 టీఎంసీలు కేటాయించుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది.
సమ్మక్కసాగర్‌లో గోదావరి జలాలను వదులుకుంటున్నందున శ్రీశైలం నుంచి పాలమూరు-రంగారెడ్డి కింద 43 టీఎంసీలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని కేంద్రం ప్రతిపాదించడం దుర్మార్గం. ఎందుకంటే? పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నందున నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ర్టాలు 85 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకొనే హక్కు ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంచేసింది. ఆ మేరకు కర్ణాటక, మహారాష్ట్ర 35 టీఎంసీలు వాడుకుంటున్నాయి. మిగిలిన 45 టీఎంసీల్లో 43 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక కమిటీని కూడా వేశారు. అందులో 43 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించేందుకు దాదాపు కమిటీ సభ్యులందరూ సంతకాలు కూడా చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి ఈ ప్రక్రియను చివరిదాకా తీసుకుపోలేదు. దీనిని బట్టి.. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కుగా సాగర్ ఎగువన తెలంగాణకు 43 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉన్నది. అంతేగానీ చంద్రబాబు చెప్తున్నట్టుగా గోదావరి జలాల్లో హక్కు వదులుకునే కర్మ తెలంగాణకు లేదు.
బాబు కోసమే ‘పాలమూరు’పై వెంపర్లాట?
రెండున్నర సంవత్సరాలుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి పని చేయని కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రాజెక్టు అనుమతుల కోసం వెంపర్లాడుతున్నది. ఇదే సమయంలో చంద్రబాబు-కేంద్రం కలిసి పాలమూరు ప్రాజెక్టు అనుమతులకు, బనకచర్ల-గోదావరి-కావేరి ప్రాజెక్టుకు లింకు పెడుతున్నది. ఈ మొత్తం వ్యవహారంలో ఇదే అసలు కుట్ర అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనేది ఉమ్మడి ఏపీలోనే ప్రతిపాదించిన ప్రాజెక్టు తప్ప కొత్తది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పనులను పూర్తిచేసి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోయాలే గానీ ఇలా అనుమతుల పేరిట కాలయాపన చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు ఏ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలను తరలిస్తున్నది? తెలంగాణ అభ్యంతరం చెప్తున్నా చంద్రబాబు తన మొదటి టర్మ్‌లో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలించుకుపోలేదా? ఎవరి అనుమతి ఉన్నదని ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది? ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు లేని అనుమతుల అడ్డంకి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకే ఉన్నట్టుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు నాటకం ఆడుతున్నదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం పాలమూరు అనుమతులను బూచిగా చూపి బనకచర్లకు లింకు పెట్టడమంటేనే ‘దాల్మే కుచ్ కాలాహై!’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అడుగడుగునా కేంద్రం అన్యాయం
‘మా నీళ్లు మాకే’ అన్నది తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదాల్లో ఒకటి. అందుకే తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసింది. ఈ భగీరథ ప్రయత్నం ఫలితంగానే ఇప్పుడు రికార్డుస్థాయి ధాన్యం ఉత్పత్తి సాధ్యమైంది. కానీ, కేంద్రం మాత్రం ఏ ఒక్కనాడూ తెలంగాణకు జల ప్రయోజనాలు చేకూర్చిన దాఖలాలు లేవు.
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే కృష్ణాజలాల్లో తెలంగాణ న్యాయమైన వాటాను నిర్ధారించేందుకు ట్రిబ్యునల్‌ను వేయాలని 2015లోనే సెక్షన్-3 కింద కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఈనాటికీ అది కొలిక్కిరాలేదు. కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టు తలుపుతట్టి న్యాయపోరాటం చేస్తుంటే, చివరకు కేంద్రం ఆ కేసును ఉపసంహరించుకోవాలనే షరతును విధించింది. ఆ తర్వాతగానీ ట్రిబ్యునల్ ముందుకు సాగలేదు. ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇలా కేంద్రం కేవలం చంద్రబాబును సంతృప్తి పరిచేందుకు అడ్డగోలుగా ట్రిబ్యునల్స్‌ను బేఖాతరు చేస్తూ సర్దుబాటు ఫార్ములాలను తెరపైకి తీసుకురావడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి రాజకీయాల కోసమేనా కేంద్రం నీటి వాటాలు తేల్చకుండా నానబెడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమ్మక్కసాగర్‌కు అనుమతిచ్చేందుకు కేంద్రం ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్వోసీ తీసుకురావాలని తెలంగాణకు షరతు విధించింది. అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. బనకచర్ల కోసం తెలంగాణపై ఒత్తిడి తెచ్చినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి ఎన్వోసీ ఇప్పించాలి కదా! అది చేయకపోగా.. ఇప్పుడు సమ్మక్కసాగర్ 47 టీఎంసీల నీటి హక్కుల్ని ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేయాలనే షరతు విధించింది. దీనిని బట్టే కుట్రలో భాగంగానే ఛత్తీస్‌గఢ్ ఎన్వోసీ ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
3. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేసీఆర్ ప్రభుత్వం 2022లో కేంద్రానికి పంపింది. పలుమార్లు తాము పరిశీలిస్తున్నట్లు కేంద్ర జల సంఘం చెప్పింది. కానీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే 2024లో డీపీఆర్‌ను వెనక్కి పంపితే, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కిమ్మనకుండా ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాజెక్టును బూచిగా చూపి బనకచర్లకు మార్గం సుగమం చేయాలని కేంద్రం చూస్తుందంటే డీపీఆర్ వెనక్కి పంపడమూ ఈ కుట్రలోని ఓ అంకమేనా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ట్రిబ్యునల్స్ ఉన్నదెందుకు?
‘సమ్మక్క బరాజ్ దగ్గర తెలంగాణ వదులుకునే 47 టీఎంసీలు, గోదావరి-కావేరిలో ఏపీకి హక్కుగా వచ్చే 45 టీఎంసీలు, కర్ణాటక వాటా 16 టీఎంసీలు (ఇందుకు బదులుగా కర్ణాటకకు బెడ్తి-హీరెవడ్డెటి లింకు కింద 16 టీఎంసీల సర్దుబాటు), ఏ రాష్ట్రం వాడుకోని 15 టీఎంసీలు, తమిళనాడు వాటా మరో 44 టీఎంసీలు.. ఇలా మొత్తం 167 టీఎంసీలను గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు కేటాయిస్తాం. ఇందుకు తెలంగాణ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పాలమూరు-రంగారెడ్డి 88 టీఎంసీల కేటాయింపునకు చంద్రబాబు సమ్మతించాలి. కేంద్రం వీటన్నింటినీ నికర జలాలుగా పరిగణిస్తుంది’ కేంద్ర ప్రభుత్వం రూపంలో చంద్రబాబు ప్రతిపాదించే లెక్కలు ఇవి. ఇంతకీ ఇందులో తెలంగాణ ప్రయోజనాలు ఏమున్నాయో ఆయనకే తెలియాలి. గోదావరిలో తెలంగాణ తన వాటాను (47 టీఎంసీలు) వదులుకుంటే కృష్ణాలో వాటా ఇస్తానంటున్నారు. మరి పోలవరం మళ్లింపు కింద బచావత్ ట్రిబ్యునల్ హక్కుగా ఇచ్చిన 45 టీఎంసీల మాటేమిటి? అంటే అవి కూడా ఆంధ్రప్రదేశ్‌కేనా? గోదావరిలో 47, కృష్ణాలో 45 టీఎంసీలు.. మొత్తంగా ఈ కుట్రతో ఏపీకి వచ్చే ప్రయోజనం అదనంగా 92 టీఎంసీల జలాలు అన్నమాట.
ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి కేంద్రం ఇలా నీటి కేటాయింపుల సర్దుబాటు చేస్తే దశాబ్దాలుగా కృష్ణాజలాల కోసం తెలంగాణ చేస్తున్న పోరాటానికి అర్థమేముంటుంది? తెలంగాణ ప్రజల సొమ్ము రూ.కోట్లు వెచ్చించి బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణలో పాల్గొంటున్నదానికి సార్థకత ఎక్కడిది? కేటాయింపులను కేంద్రమే నాలుగు గోడల మధ్య పూర్తి చేస్తే ట్రిబ్యునల్స్ ఎందుకు దండుగ? ముఖ్యంగా ఏడు రాష్ర్టాలున్న గోదావరి బేసిన్‌లోని జలాల్లో బచావత్ అవార్డును పరిగణనలోనికి తీసుకోకుండా ఇలా కేవలం రెండు రాష్ర్టాలకు పరిమితం చేస్తే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన జల ట్రిబ్యునల్స్‌కు మనుగడ ఉంటుందా? చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్ల కోసం కేంద్రం తెలంగాణపై ఒత్తిడి తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా సంధి కుదిరిస్తే, భావి తెలంగాణకు జరిగే చారిత్రక అన్యాయాన్ని పూడ్చేదెవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.