హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు ఓవరాక్షన్ వల్లే బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలోని కరువు ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయకుండా, బనకచర్లను తెరపైకి తేవడమేమిటని ప్రశ్నించారు. ముందు ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ఆ తర్వాతే తెలంగాణతో చర్చించి బనకచర్ల కట్టుకోవాలని సూచించారు.
శుక్రవారం ఆయన హైదరాబాద్లోని మఖ్ధూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుపై సరైన అవగాహన లేకుండానే చంద్రబాబు పోలవరం, బనకచర్లపై లింక్ పెట్టి మాట్లాడారని తప్పుబట్టారు. చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే సహజంగానే తెలంగాణకు కోపం వస్తుందని చెప్పారు. రేవంత్రెడ్డి బనకచర్లపై ప్రశ్నిస్తే మూడోసారి చంద్రబాబు ప్రెస్మీట్ పెట్టారని గుర్తుచేశారు.