హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కృష్ణా నది నుంచి కూడా ఏటా వందల టీఎంసీలు సముద్రానికి పోతున్నాయని, వాటిని మళ్లించుకునేందుకు తెలంగాణకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ముందు తెలంగాణ సర్కారు ప్రతిపాదన పెట్టింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖకు తాజాగా లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రి ఫిజబులిటీ రిపోర్టు)ను కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించిన నేపథ్యంలో దీనిపై అభిప్రాయాలను తెలపాలంటూ తెలంగాణకు కేంద్రం లేఖ రాసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ రిపోర్టుపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది.
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో మిగులు జలాల ప్రస్తావనే లేదని పేర్కొన్నది. తెలంగాణ నీటి వినియోగ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండానే గోదావరిలో మిగులు జలాలు ఉంటాయని ఏపీ లెక్క తేల్చిందని అభ్యంతరం వ్యక్తంచేసింది. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి నుంచి జలాలను మళ్లిస్తే అలా మళ్లించే జలాల్లో బేసిన్‌లోని రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. గతంలో పోలవరం డైవర్షన్ ద్వారా మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో వాటాల అంశాన్ని గుర్తుచేసింది. ప్రస్తుతం బనకచర్ల ద్వారా మళ్లించాలని చూస్తున్న 200 టీఎంసీల జలాలను కూడా అదే ప్రొరేటా ప్రకారం పంచాల్సి ఉంటుందని, కానీ, ఆ ప్రస్తావనే పీఎఫ్ఆర్ రిపోర్టులో లేకుండా పోయిందని పేర్కొన్నది.