Transfers | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ఇంజినీర్లు, ఉద్యోగుల బదిలీలకు సర్కార్ పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. టీజీ జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కంలలో బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. 2026 జనవరి 31లోగా బదిలీలను పూర్తిచేయాలని గడువు విధించారు. అయితే ఈ వారంలో సెలవులు ఉండటంతో వచ్చేవారంలో కసరత్తు చేసి జనవరి మొదటి వారంలో బదిలీలు చేప ట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో పైరవీల దందా షురూ అయ్యింది. టీజీ జెన్కోలో చాలామంది హైదరాబాద్‌లోని విద్యుత్తు సౌధకు బదిలీపై వచ్చేందుకు పైరవీలు మొదలుపెట్టారు. జెన్కో ప్లాంట్లల్లో పనిచేసేందుకు చాలామంది ఆసక్తి చూపించడంలేదు.
అధిక హెచ్ఆర్ఏ కోసం చాలామంది హైదరాబాద్ వైపు చూస్తున్నట్టు తెలుస్తున్నది. వైటీపీఎస్‌కు వెళ్లేందుకు చాలామంది అనాసక్తి చూపిస్తున్నారు. డిస్కంలో పనిచేస్తున్న డీఈ, ఏడీఈ, ఏఈలు ఫోకల్ పోస్టులపై గురిపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పోస్టులకు గిరాకీ అధికంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బేరాలు కుదిరాయ ని, ఎవరెవరిని బదిలీ చేయాలో ఇప్పటికే స్కెచ్ రెడీ అయిందని ఇంజినీర్లు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ పెద్ద నుంచి లేఖలు, ఆదేశాలు రావడ మే ఆలస్యం.. బదిలీ ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారన్న ప్రచారం జరుగుతున్నది. పై నుంచి ఆదేశాలు రావడమే తరువాయి అన్నట్టు గా పరిస్థితులున్నాయని సమాచారం. సదరు ప్రభుత్వ పెద్ద ఆశీర్వాదం కోసం మరికొందరు ఇంజినీర్లు, ఉద్యోగులు క్యూ కడుతున్నట్టు తెలిసింది.
విద్యా సంవత్సరం మధ్యలోనా..
సహజంగా వేసవిలో బదిలీలు చేపడుతా రు. విద్యుత్తు సంస్థల్లో మాత్రం జనవరిలో బదిలీలు చేపట్టడం పట్ల కొందరు ఉద్యోగులు విస్మయం వ్యక్తంచేస్తున్నా రు. పైరవీలకు తావు లేకుం డా బదిలీలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్రంలో మిగతా శాఖల్లో బదిలీలపై నిషేధం ఉన్నది. కానీ విద్యుత్తు శాఖల్లో బదిలీపై నిషేధం ఎత్తివేయడం వెనుక ఏదో గూడుపుఠాణి ఉందన్న ఆరోపణలొస్తున్నాయి.
ట్రాన్స్ఫర్ పాలసీ లేకుండానే..
టీజీ జెన్కోలో బదిలీలు చేసేందుకు ట్రాన్స్ఫర్ పాలసీయే లేదు. మొదట ట్రాన్స్ఫర్ పాలసీని రూపొందించి బదిలీలు చేపట్టాలని ఇంజినీర్లు, ఉద్యోగులు గతంలో హైదరాబాద్‌లో పదేండ్లు పనిచేసిన వారిలో 30% ఇంజినీర్లు, ఉద్యోగులను బదిలీ చేశారు. విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల ల్లో పదిహేనేండ్లు పనిచేసిన వారిని సైతం బదిలీచేశారు. ఇక స్పౌజ్ కోటా, అనారోగ్య కారణాలతో బదిలీ చేసిన సందర్భాలున్నాయి. దీనికి ముగింపు పలికి ఈ సారైనా ట్రాన్స్ఫర్ పాలసీని విడుదల చేయాలని సంఘాలు కోరుతున్నాయి. పాలసీని విడుదల చేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.