హైదరాబాద్, మార్చి 16 ( నమస్తే తెలంగాణ ) : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇది విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో శాంతియుత వాతావరణం ఉండేలా ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాల, రాజకీయ ఆలోచనల సంఘర్షణల కేంద్ర బిందువైన ఓయూలో వీసీ తీసుకొచ్చిన ఈ నిర్ణయం ప్రజాపాలనలో భాగమేనా? అని ప్రశ్నించారు. వర్సిటీలో నిర్బంధ పాలనకు తెరలేపారని విమర్శించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఓయూ విద్యార్థులు రోడ్డెక్కకుండా అల్టిమేటం జారీ చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపాలనే దుర్మార్గమైన ఆలోచనలను మానుకొని, వారి హక్కులను కాపాడాలని కోరారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల తరఫున బీఆర్ఎస్వీ పోరాడుతుందని స్పష్టంచేశారు.
ఉస్మానియా యునివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలపై తీసుకొచ్చిన నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆందోళనలే చేయవద్దని పాలకవర్గం ఆదేశాలు ఇవ్వడం తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరచడమేనని పేర్కొన్నారు. నిషేధాజ్ఞలను ఎత్తివేయకుంటే వర్సిటీ అగ్నిగుండంగా మారుతదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ఉస్మానియాలో నిషేధాజ్ఞలు విధిస్తే ప్రొఫెసర్ కోదండరాం ఎకడ ఉన్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలో ఎలాంటి నిరసనలు, ధర్నాలు నిర్వహించరాదని ఉపకులపతి, రిజిస్ట్రార్ విడుదల చేసిన సర్యూలర్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు మాట్లాడుతూ.. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో పోరాటాలు, త్యాగాలకు చిహ్నమని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఎంతోమంది వీరులను సమాజానికి పరిచయం చేసిన నేల అని పేర్కొన్నారు. అటువంటి నేలపై నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్య హకులను కాలరాసే విధంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేయడం వారి నియంతపోకడకు నిదర్శనమని విమర్శించారు. విద్యార్థి ఉద్యమాలను అణచాలని చూస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వా మ్య హక్కులను కాలరాసేలా ఇచ్చిన ఆదేశాలను వెంటనే వెనకి తీసుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.