హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ తిరిగి పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో బదిలీల కోసం ఇచ్చిన తాతాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవో 57ను సోమవారం జారీచేశారు. జూన్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. గతంలో జారీచేసిన జీవో-38 ప్రకారం.. 2026 మే 1నుంచి మే 31వరకు కొన్ని నిర్దిష్ట నిబంధనలతో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది. మే 31తో ఆ గడువు ముగిసిపోవడంతో జూన్ 1 నుంచి అన్ని రకాల బదిలీలను నిలిపివేస్తూ సరార్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించినప్పుడు, ఇతర ఉద్యోగులను బదిలీ చేయకుండా ఖాళీగా ఉన్న స్థానాల్లో వారికి పోస్టింగ్స్ ఇవ్వచ్చని తెలిపారు. పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశీ సర్వీసులకు తిరిగొచ్చిన వారు, డిప్యుటేషన్లు(ఫారిన్ సర్వీస్ మాత్రమే), క్రమశిక్షణా చర్యల వల్ల వచ్చే వారికి ఇతర ఉద్యోగులను కదల్చకుండా ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఆరు నెలల కంటే ఎకువ కాలం సుదీర్ఘ సెలవుపై వెళ్లి తిరిగి విధుల్లో చేరే ఉద్యోగులకు ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వచ్చని వెల్లడించారు.
వచ్చే 6 నెలలు బదిలీ ప్రతిపాదనలు వద్దు
వచ్చే ఆరు నెలల వరకు బదిలీల నిషేధాన్ని సడలించాలనే ఎలాంటి ప్రతిపాదనలను ఏ శాఖ కూడా స్వీకరించవద్దని జీవోలో స్పష్టంచేశారు. ఎకడైనా నిషేధాన్ని సడలించాల్సి వస్తే.. సచివాలయ పరిపాలనా శాఖ తగిన కారణాలతో కూడిన ఫైల్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి పంపి, వారి సర్యులేషన్ ఉత్తర్వుల ద్వారా మాత్రమే అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బదిలీలు చేస్తే కఠిన చర్యలుంటాయని జీవోలో ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీ అయిన ఉద్యోగుల వేతనాల బిల్లులను ఆమోదించవద్దని తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ వర్స్ అకౌంట్స్లను ప్రభుత్వం ఆదేశించింది. గతంలో మహిళా, శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖలతో పాటు సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన కొన్ని పాత జీవోలు, మెమోలు యథాతథంగా అమల్లో ఉంటాయని, అయితే వాటి కింద బదిలీలు చేపట్టాలన్నా ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు అందరూ ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సుల్తానియా ఉత్తర్వుల్లో పేరొన్నారు.