హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు సవాల్ విసిరే అర్హత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. గతంలో అనేకసార్లు సవాళ్లు విసిరి పారిపోయారని, ఇప్పుడు కొత్తగా సవాల్ విసురుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయాలని, దేశవ్యాప్తంగా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపోయే సీట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ గ్యాస్ సబ్సిడీ పథకం, 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్నవారందరికీ ఫ్రీ కరెంట్ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టాన్ని విధ్వంసం వైపు రేవంత్‌రెడ్డి నడిపిస్తున్నారని, తెలంగాణ ప్రగతిపై విషం కకుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ కొట్టుకొనిపోవాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు రేవంత్‌రెడ్డిని పొగడాలా? కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టినందుకు పొగడాలా? అని ఎద్దేవా చేశారు. నాలువేల పింఛన్, రైతు రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా ఏమయ్యాయని ప్రశ్నించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగకుండా బూతు పురుణాలను అందుకుంటున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో మోదీ ఉంటే ఇక్కడ ఏడీ (అటెన్షన్, డైవర్షన్)గా రేవంత్‌రెడ్డి తయారయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, సచివాలయం, మేడారం జాతర, టీవీ ఇంటర్వ్యూలు ఎకడైనా రేవంత్‌రెడ్డి భాష ఒకేలా ఉంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రుల ఖాతాల్లోకి ప్రభుత్వ డబ్బు
తెలంగాణను బంగారుపల్లెంలో పెట్టి రేవంత్‌రెడ్డికి అప్పగిస్తే రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరులాగా మారుస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. రైతుబంధు డబ్బులు మంత్రి పొంగులేటి ఖాతాల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఏయే కంపెనీలకు, కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు. రైతులు, పింఛన్‌దారులు, మహిళల ఖాతాల్లోకి వెళ్లాల్సిన డబ్బులను మళ్లించారని దుయ్యబట్టారు. రైతుబంధు డబ్బులు ఇవ్వాలని, మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని, మెగా డీఎస్సీని వేయాలని, గ్రూప్- 2, గ్రూప్-3 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల దురదృష్టం కొద్ది రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, గాంధీనాయక్ పాల్గొన్నారు.