Balka Suman | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సోకేసు నమోదు చేయలేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల విషయంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఇవాళ బాల్క సుమన్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. చెన్నూరు నియోజకవర్గంలో వడ్లుకొనే పరిస్థితి లేదని బాల్క సుమన్ అన్నారు. మంత్రి వివేక్‌కు కలెక్టర్ గుమాస్తా లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి వివేక్ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా ప్రమాదవశాత్తూ లక్సెట్టిపేటలో నలుగురు రైతులు చనిపోతే ఎందుకు పరామర్శించలేదని మండిపడ్డారు.