చెన్నూర్, జూలై 29: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు, చిల్లర విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చిల్లర నాయకుడని, వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన భారీ వర్షాల కారణంగా చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పెంపుడు కుక్క, దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు.
‘రైతులకు మూడు గంటల విద్యుత్తు చాలు.. రైతుబంధు ఎత్తేస్తాం.. ధరణిని రద్దు చేస్తాం’ అంటూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగబుద్ధి, వక్రబుద్ధి ఉన్న కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని, రైతు పక్షపాతి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. వరదలో చిక్కుకున్నవారి కోసం సీఎం కేసీఆర్ సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు. వరదలో చిక్కుకున్న ఏ ఒక్కరికైనా బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.