హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలు కాకుండా కాంగ్రెస్ సర్కార్ కొత్తగా ఎన్ని నోటిఫికేషన్లు వేసిందో? ఎన్ని కొత్త ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక కొత్తగా నోటిఫికేషన్లు, ఉద్యోగాలేవీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. అబద్ధాలకు రేవంత్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని, నయా మోసగాడని విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని ఎద్దేవాచేశారు.
ఒక్క హామీ అమలు కాలే
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభ ఏర్పాటు చేశారని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఆమెతో చెప్పించారని, ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారని, 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ సూటీలు ఇస్తామని చెప్పారని, వీటిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని బాల్క ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, మరో రెండు నెలలైతే ఏడాది పూర్తవుతుందని, ఈ రెండు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
నిరుద్యోగుల నోట్లో మట్టి
ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ చెప్పిందని, తాము అధికారంలో ఉన్నప్పుడు 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 43వేల ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని సుమన్ తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా ప్రైవేట్ రంగంలో 24 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని, 2.32లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని, 2.27 లక్షల ఉద్యోగాలకు బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చామని, బీఆర్ఎస్ సర్కార్ ఆరు వేల టీచర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఐదు వేలు కలిసి నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు.
నిరుద్యోగుల నోట్లో కాంగ్రెస్ మట్టికొట్టిందని, మూటలు సర్దుకోవడం, ఢిల్లీకి పంపడంపై రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. నిరుద్యోగులను రేవంత్‌రెడ్డి ఎందుకు కలవడం లేదని?, ఒక మంత్రి అయినా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా? అంటూ నిలదీశారు. మరో రెండు నెలలు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఆ తర్వాత నిరుద్యోగ యువతతో కలిసి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్‌లో కొత పెట్టారని, కార్మికులకు రూ.3.80 లక్షలు రావాల్సి ఉంటే కేవలం రూ.1.90 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, కార్మికుల బోనస్ డబ్బులు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ అభిలాషరావు, నరేశ్‌రెడ్డి, విజయ్ పాల్గొన్నారు.