Balka Suman | బంజారాహిల్స్/హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధన కోసం పోరాడిన, పదేండ్లపాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతిసేలా కొన్ని న్యూస్‌చానళ్లు కుట్ర పూరితంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. శుక్రవారం ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లలో 16 చానళ్లు, యూట్యూబ్ చానళ్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీ కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ చర్చ సందర్భంగా ఈడీ కేసీఆర్ పేరును ప్రస్తావించిందని కొన్ని చానళ్లు ఇష్టమొచ్చిన వార్తను ప్రచారం చేశాయి. వాస్తవాలను నిర్ధారించుకోకుండా, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతియాలని, ఆయనపై బురద చల్లాలని వార్తలను ప్రసారం చేసినట్టుగా ఉన్నది.
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించిన ఆ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం’ అని వెల్లడించారు. వాస్తవానికి లిక్కర్ కేసుపై జరిగిన వాదనల సమయంలో ఓ న్యాయవాది పొరపాటున మాట్లాడిన ఒక మాట ఆధారంగా.. కేసీఆర్ డైరెక్షన్లోనే లిక్కర్ స్కామ్ అంటూ పలు మీడియా చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. అయితే సదరు న్యాయవాది ప్రస్తావించిన విషయంలో వచ్చిన పేరు మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాస్‌రెడ్డి అని తేలింది. తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన చానళ్లలో ఏబీఎన్, ఈటీవీ, వీ6, ఎన్టీవీ, ఐ న్యూస్, అమ్మ న్యూస్, బీఆర్కే న్యూస్, డయల్ న్యూస్, జర్నలిస్ట్ సాయి, మైక్‌టీవీ న్యూస్, నేషనల్ హబ్, ప్రైమ్9 న్యూస్, ఆర్టీవీ, రాజ్‌న్యూస్, రెడ్న్యూస్, వైల్డ్ వోల్ఫ్ ఉన్నాయని బాల్క సుమన్ వివరించారు.
చానళ్ల యజమానులు, కీలక బాధ్యతల్లో ఉన్నవారు, యాంకర్లపై ఫిర్యాదు చేశామని తెలిపారు. తప్పుడు వార్తలను ప్రచారం, ప్రసారం చేస్తున్న చానళ్లపై చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ అస్థిత్వం కోసం, సంస్కృతి, ప్రాంత అవసరాల కోసం పోరాడినవారిని, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఆ చానళ్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని తప్పుడు కూతలు కూసినా కేసీఆర్ నాయకత్వంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అందరం కలిసి తెలంగాణ ప్రయోజనం కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పోరాటాం చేస్తామని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కే విప్లవ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.