రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సం ఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. గ్యారెంటీలు అమలు చేయడం చేతకాని రేవంత్‌రెడ్డి.. ఢిల్లీకి మాత్రం సంచులు మోస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని, మోసం చేస్తానంటూ గతంలో ఓ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ ధైర్యంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 420 హామీలిచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలకు బాకీ పడినందున కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ విడుదల చేయాల్సి వచ్చిందని తెలిపారు.
బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అప్పు పత్రం రాసిచ్చినట్టు కాంగ్రెస్ నేతలు సంతకాలు పెట్టి ప్రజలకిచ్చిన బాకీ కార్డును కోర్టులో కూడా చాలెంజ్ చేయవచ్చ ని సూచించారు. మహిళలకు రూ.2,500 చొప్పున 22 నెలలకు ఒక్కొక్కరికి రూ.55 వేలు, వృద్ధులకు రూ.44వేలు, వికలాంగులకు రూ. 64వేలు, కల్యాణలక్ష్మి పథకం కింద పెండ్లయిన ప్రతి మహిళకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్టు తెలిపారు.