Anti Drugs | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్ కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ఏర్పాటుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి బలగం సినిమా డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య హాజరయ్యారు. మొదటగా మాదకద్రవ్యాల నిర్మూలనపై నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ, బలగం టీం, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 8 నుండి 10వ తరగతి, ఇంటర్ కళాశాలల్లో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడితో కూడిన యాంటీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాలపై తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగహన కల్పిస్తూ ఉండాలని సూచించారు. ఒక వేళ ఎవరైనా ఇలాంటి చెడు వ్యసనాలకు గురైతే వెంటనే డయల్ 100 ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో సినీ హీరోలు రోల్ మోడల్‌గా ఉంటున్నారని, ఈ వినూత్న కార్యక్రమానికి బలగం టీంను ఆహ్వానించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన ఆరు నెలల్లో 17 కేసులు నమోదు చేసి 55మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
బలగం సినిమా డైరెక్టర్ ఎల్దండి వేణు మాట్లాడుతూ.. మనం జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే డ్రగ్స్‌లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలో తమ స్నేహితులను చూసి ఇలాంటి వాటికి అలువాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
హీరో ప్రియదర్శి మట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌లాంటి చెడు అలవాట్లలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తనకు రెండేళ్ల క్రితం వరకు సిగరెట్ అలవాటు ఉండేదని, తన కుటుంబసభ్యుల కోసం ఆ చెడు అలవాటును మాని సంతోషంగా గడుపుతున్నట్లు తన స్వీయ అనుభవాన్ని విద్యార్థులకు వివరించారు.