వర్ని, జూన్ 10 : బీజేపీ, కాంగ్రెస్ రెండూ తోడు దొంగల పార్టీలని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో బాన్సువాడకు రూ.వేల కోట్ల నిధులు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన పోచారం శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాడని చెపారు.
బాన్సువాడ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించిన కేసీఆర్ని కాదని, కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం కుటుంబంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్సీ, సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీగౌడ్ మాట్లాడుతూ.. బాన్సువాడలో జరిగిన ప్రతి అభివృదికీ కేసీఆరే కారణమని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బాన్సువాడ ఇన్చార్జి తోట ఆగయ్య, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.