నాంపల్లి కోర్టులు, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌కుమార్, అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలు చేసిన మాండెటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను కోర్టు గురువారం తిరస్కరించింది. నిందితుల రిమాండ్ 90 రోజులు పూర్తికావడంతో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసి, కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఇటీవల పంజాగుట్ట పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేసినప్పటికీ తప్పులు దొర్లినందున కోర్టు వెనక్కి పంపించిందని గుర్తుచేశారు. అందువల్ల చార్జిషీట్ దాఖలు చేసినట్టుగా పరిగణించరాదన్నారు. రిమాండ్ ఖైదీలుగా 90రోజులు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇందుకు ప్రత్యేక పీపీ సాంబశివారెడ్డి అభ్యంతరం తెలిపారు. పోలీసులు 90 రోజుల్లోపే చార్జిషీట్‌ను దాఖలు చేశారని, 167(2) సీఆర్పీసీ ప్రకారం తప్పనిసరి బెయిల్ మంజూరు చేయాలన్న నింబంధన వర్తించదని చెప్పారు. విచారణ కీలక దశలో ఉన్నదని పీపీ వాదనతో కోర్టు ఏకీభవించి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది.