సూర్యాపేట, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): లగచర్లలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే ఎవరూ ఊరుకోరని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌కు ఏం జరిగినా ప్రజా క్షేత్రంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం భగ్గుమంటది జాగ్రత్త అని తెలిపారు. బాంబులు పేలుతాయంటూ మంత్రులు బెదిరింపులకు గురిచేస్తున్నారని, బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, తమ నాయకులు ఎవరికీ భయపడరని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పాలన వదిలి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం కాదు ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్కు ముఖ్యమని, ప్రజా శ్రేయస్సుకు భంగం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.