హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు బడిబాటను ఈనెల 14నుంచి 19వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సర్కార్ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రస్తుతం 184 విద్యార్థులుండగా, 203 అడ్మిషన్ల లక్ష్యాన్ని నిర్దేశించారు.
వరంగల్ పట్టణంలోని నరేంద్రనగర్ ప్రాథమిక పాఠశాలలో 292 మంది ఉండగా, 322మంది విద్యార్థులను చేర్పించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ జిల్లా పరిషత్ పాఠశాలలో 230 విద్యార్థులుండగా, 253కు పెంచాలని, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ జెడ్పీహెచ్ఎస్లో 124 విద్యార్థులుంటే 137 మందికి చేర్చాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.