కేసముద్రం, మే 15: వేరుశనగ పంటను అమ్ముకుందామని మార్కెట్‌కు తెస్తే వ్యాపారులు కొంటలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెందిన రైతులు ముదిగిరి కుమారస్వామి, సుధాకర్ 15 బస్తాల చొప్పున వేరుశనగను బుధవారం కేసముద్రం మార్కెట్‌కు తీసుకొచ్చారు.
ఉదయం ఈ-నామ్ ద్వారా వ్యాపారులు టెండర్ వేయగా వేరుశనగను ఏ వ్యాపారి కూడా ఖరీదు చేయలేదు. దీంతో రైతులు మార్కెట్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయగా వ్యాపారులను అడగాలని సూచించారు. ఈ మేరకు రైతులు మిల్లుల వద్దకు వెళ్లి వేరుశనగను కొనాలని కోరగా, కొంతమంది నిరాకరించగా, మరికొంతమంది క్వింటాల్‌కు రూ.4 వేల చొప్పున ఖరీదు చేస్తామని చెప్పారు. సాయంత్రం వరకు చూసినా ఎవరూ కొనకపోవడంతో చేసేదేమీ లేక రైతులు ఇంటికి తీసుకెళ్లారు.