వికారాబాద్, జనవరి 6 : ప్రాణాలు పోసే వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఓ డాక్టర్ ప్రవర్తించాడు. దీంతో చిన్నారి మృతి(Baby dies) చెందింది. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్(Vkikaabad )జిల్లా నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి, స్వప్నలకు గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. బిక్షపత్తి ప్రైవేటు పని చేయగా, స్వప్న ఓ ప్రభుత్వదవాఖానలో నర్సుగా పని చేస్తుంది. కాగా, గత 4 రోజుల క్రితం ప్రసవం కోసం స్వప్న వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చేరింది.
పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయగా బాబు జన్మించాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తల్లిదండ్రులకు అప్పగించారు. గత మూడు రోజులుగా ఆరోగ్యంగా ఉండటం చూసి తల్లిదండ్రుల ఆనందం ఆకాశానంటాయి. ఆదివారం రాత్రి విధులు నిర్వహించిన డాక్టర్ అశోక్‌కుమార్ బాబును పరీక్షించి బాగానే ఉన్నాడని చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అయితే అర్దరాత్రి 1 గంటల సమయంలో బాబుకు ఎక్కిళ్లు రావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న డాక్టర్ అందుబాటులో లేడు. ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పి రాలేదు.
దవాఖానలో ఉన్న వైద్యసిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించిన వైద్య సిబ్బంది శ్రమ వృథా అయిపోయింది. 4:30 గంటల ప్రాంతంలో విధుల్లో ఉన్న డాక్టర్ వచ్చి చూడగా బాలుడు ఉలుకు పలుకు లేకుండా పోయాడు. దీంతో బాలుడు మృతి చెందాడని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడి నుండి బాబుని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్తే అర గంట ముందు చనిపోయాడని బాధితులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమయానికి డాక్టర్ వచ్చి ఉంటే బాబు బతికేవాడని.. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మా బాబు చనిపోయాడని తల్లితదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ అశోక్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ దవాఖానకు సీఐ భీమ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలు చేరుకొని వివరాలు సేకరించారు. ఈ విషయంపై దవాఖాన సూపరింటెండెంట్ స్పందిస్తూ..బాబు చనిపోయిన విషయం వాస్తవమే. జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందజేశాం. వారి దేశాల మేరకు డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.