రామగిరి, ఆగస్టు 25 : నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో మరో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కుర్చీలో గర్భిణి ప్రసవం జరిగిన విషయం మరువకముందే వైద్యులు, సిబ్బంది నిర్వాకంతో మరో మహిళ గర్భంలోనే శిశువు మృతిచెందింది. శ్రీలత భర్త రాజు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం గారకుంటపాలేనికి చెందిన చెరుకుపల్లి శ్రీలతను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం నల్లగొండలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తుండగా సిబ్బంది, డ్యూటీ డాక్టర్ అడ్డగించారు.
హడావిడిగా రాత్రి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తుండగానే మగ శిశువు గర్భంలోనే మృతిచెందింది. సకాలంలో వైద్యం అందకపోవడంతోనే శిశువు చనిపోయినట్టు బాధితులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. శిశువు శరీరంపై గాయాలున్నాయని, వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం ఇదే దవాఖానలో ‘కుర్చీలోనే ప్రసవం’ ఘటనకు సంబంధించి అదనపు కలెక్టర్ పూర్ణచందర్ సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో శనివారం డాక్టర్లు మూకుమ్మడిగా సెలవులు పెట్టడంతో వైద్య సేవలు కొనసాగలేదు. ఈ క్రమంలోనే శ్రీలత మాతాశిశు సంరక్షణ కేంద్రానికి రావడం.. సరైన సమయంలో వైద్యం అందక పోవడం, ఆపరేషన్ చేస్తున్న క్రమంలో శిశువు మృతి చెందడంతో ఈ దవాఖాన పేరు మరోమారు చర్చల్లోకి ఎక్కింది. రాత్రి నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, దవాఖాన ఎదుట ధర్నాకు దిగారు.