పాలకుర్తి, జూన్14: బీటెక్ చేసి ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాలలోని శాలపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాలకు చెందిన బండి నవీన్ (27) 2018లో బీటెక్ పాస్అవుట్ అయ్యాడు. ఏడేండ్లుగా ఉద్యోగవేటలో ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా సరైన కొలువు దక్కకపోవడంతో మనస్తాపం
చెందాడు. ఈ నెల 12న ఇంట్లో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్‌లోని దవాఖానకు తరలించగా, చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. సోదరుడు కిరణ్ పిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ స్వామి తెలిపారు.
నవీన్ కండ్లు సజీవం
బండి నవీన్ శుక్రవారం మృతిచెందగా, అతడి కండ్లను కుటుంబసభ్యులు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ పాలకుర్తి మండలాధ్యక్షుడు భీమనపల్లి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఐ బ్యాంకుకు నేత్రదానం చేశారు. అంధులకు కంటిచూపు ప్రసాదించేందుకు పెద్ద మనుసుతో నేత్రదానానికి ముందుకు వచ్చిన తల్లి లక్ష్మి, అన్నావదిన కిరణ్, సుప్రితను గ్రామస్థులు అభినందించారు.
లోన్‌యాప్ వేధింపులకు యువకుడి బలి ; పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఘటన
పెద్దపల్లి రూరల్, జూన్ 14: లోన్ యాప్ వేధింపులకు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన తాడిచెట్టి సాయి కిశోర్ (27) బలయ్యాడు. కుటుంబ సభ్యులు, బసంత్‌నగర్ ఎస్సై కే స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయికిశోర్ కరీంనగర్లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అవసరాల కోసం ఆన్లైన్ లోన్ యాప్‌లో రూ.లక్ష అప్పు చేశాడు. ఇటీవలి కాలంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులు పెరిగిపోవడం, అప్పుతీర్చే మార్గంలేక మనస్తాపం చెందాడు. ఈనెల 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గమనించి చికిత్స కోసం తొలుత పెద్దపల్లి, తర్వాత కరీంనగర్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని దవాఖానలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. సాయి కిశోర్ మృతి చెందడంతో అతని కండ్లను హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ దవాఖానకు కుటుంబ సభ్యులు దానం చేశారు.