హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. అక్టోబర్ 1న రాష్ట్ర డీజీపీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శివధర్‌రెడ్డి వివిధ జిల్లాల ఎస్పీగా, ఇతర హోదాల్లో పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆయన అందించిన విశేష సేవలకు గాను పలు అవార్డులు అయనను వరించాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని తూలేకలాన్ ఆయన స్వగ్రామం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తిచేసిన శివధర్‌రెడ్డి.. కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ కూడా చేశారు. 1994లో సివిల్ సర్వీసెస్ సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశం పొందారు.