హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పీడీఎస్‌యూ మహాసభ దీక్షిత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించకపోవడంతో విద్యార్థులంతా అర్ధాకలితో చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి వివిధ ఎంట్రెన్స్పరీక్షలకు నిపుణుపుణులైన అధ్యాపకులచే శిక్షణ క్లాసులు బోధించాలని, ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, ఇంటర్, డిగ్రీ చదువుతున్న బాలురందరికి ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర నాయకుడు బి.అజయ్, జిల్లా నాయకులు వంశీ, కార్తీక్‌లు ప్రసంగించారు. అనంతరం పీడీఎస్‌యూ హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన కమిటీని 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దీక్షిత్, ఉపాధ్యక్షుడిగా అజయ్, ప్రధాన కార్యదర్శిగా చరణ్, సహాయ కార్యదర్శిగా డి.అర్చన, కోశాధికారిగా శివ, సభ్యులుగా ఎ.చరణ్, సిద్దు, రాహుల్, భూక్య వీరన్న, చైతన్య, లవకుమార్, రితీష్, అఖిల్‌ని ఎన్నుకున్నారు. అనంతరం మహాసభ పలు తీర్మానాలు ఆమోదించారు.