హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీ ఫారాలు అందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇదివరకే 110 మందికి బీ ఫారాలు అందించగా మిగిలిన తొమ్మిది మందికి మంగళవారం అందజేశారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ వారికి బీఫారాలు అందించి అభినందించారు. అలంపూర్‌కు గతంలో ప్రకటించిన అబ్రహాంకు బదులుగా విజేయుడికి బీ ఫారం అం దించారు.
గోషామహల్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్, నాంపల్లి నుంచి అనంద్కుమార్గౌడ్ను ప్రకటించారు. చాంద్రాయణగుట్టకు ఎం సీతారాంరెడ్డి, యాకత్పురా సామ సుందర్‌రెడ్డి, బహుదూర్‌పుర ఇనాయత్ అలీ బక్రీ, మలక్‌పేట తీగల అజిత్‌రెడ్డి, కార్వాన్ అయిందాల కృష్ణ, చార్మినార్ సలావుద్దీన్ లోడిలకు బీఫారాలు అందజేశారు. మొత్తం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు వారికి బీఫారాలు అందించిన మొదటి పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.