సైదాబాద్, జూన్ 13 : సంప్రదాయ వైద్యంలో మౌలిక, సాహిత్య పరిశోధనల సహకార కేంద్రంగా సైదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్)ను డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా గుర్తించింది. ఇందుకుగాను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్‌లోని తమ కార్యాలయాన్ని ఎంపికచేసిందని ఇన్చార్జి డైరెక్టర్ గోలి పెంచల ప్రసాద్ తెలిపారు. సీసీ ఇండియా-177తో కొల్లాబోరేటివ్ సెంటర్‌గా జూన్ 3 నుంచి నాలుగేళ్ల పాటు జరిగే పరిశోధనల కోసం మంజూరు చేశారన్నారు. 1956లో స్థాపించిన ఆయుష్ సంస్థ ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, సిద్ధ, సోవా-రిగ్పా, యునాని, హోమియోపతి, బయోమెడిసిన్తోపాటు దేశంలోని ఇతర సంబంధిత ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో వైద్య-చారిత్రక పరిశోధనల డాక్యుమెంట్, ప్రదర్శనలకు ప్రత్యేకమైన సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. సంప్రదాయ వైద్య పరిశోధనలను ప్రొఫెసర్ వైద్య రబీనారాయణ నాయకత్వంలో డాక్టర్లు సాకేత్‌రామ్, సంతోష్ మానే బృందం కొనసాగిస్తారని పేర్కొన్నారు.