మోర్తాడ్, జనవరి 4: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలు వృథాగా పోవద్దన్న ఉద్దేశంతో నిర్మించిన వరద కాలువ నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నది. ఈ కాలువ నిర్మించినప్పటి నుంచి ఎక్కడా గండిపడిన ఘటనలు జరగలేదు. మొదటిసారి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద పెద్దవాగుపై నిర్మించిన అక్విడెక్ట్‌ను ఆనుకుని చేపట్టిన నిర్మాణం వద్ద 2025 అక్టోబర్ 9న గండిపడింది. దీంతో అప్పటి నుంచి ఈ కాలువకు ఎస్సారెస్పీ నుంచి నీటివిడుదలను నిలిపివేశారు. పంట భూములకు 15 మీటర్ల లోతులో వరదకాలువ ఉండటంతో పరిసరప్రాంతాల్లో భూగర్భజలాలు మెరుగుపడి రైతులకు వరప్రదాయినిగా మారింది.
వరదకాలువ ద్వారా చెరువులను నింపేందుకు తూములను మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హయాంలో దొన్కల్, పాలెం, తిమ్మాపూర్, కమ్మర్పల్లి, నాగాపూర్ గ్రామాల శివారుల్లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం వరదకాలువకు గండిపడడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఒకప్పుడు వరదకాలువలో నీళ్లు లేనప్పుడు వర్షాల ద్వారా వచ్చిన నీటిని కట్టలు కట్టి, గ్రామాల వారీగా నిల్వచేసుకునేవారు.
ఇది పలుమార్లు గ్రామాల మధ్య గొడవలకు కూడా దారితీసింది. కాళేశ్వరం జలాలతో రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువలో ఎప్పుడైతే నీరెదురెక్కి వచ్చిందో వరదకాలువకు మరింత ప్రాధాన్యం పెరిగింది. చాలామంది రైతులు వరదకాలువపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరదకాలువకు గండి పడటంతో వేసవిసాగుపై ఎక్కువగా ప్రభావం పడనున్నది. వరదకాలువపై ఆధారపడి పంటలు పండించే రైతులు పెద్దమొత్తంలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి.
మోర్తాడ్ మండలం గాండ్లపేట్ అక్విడెక్ట్ ప్రాంతంలో వరదకాలువకు పడిన గండి కారణంగా యాసంగి పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడనున్నదని, వెంటనే రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువలో నీళ్లు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువలోకి నీళ్లు వదలని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని నిజామాబాద్ జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. వరదకాలువకు అక్టోబర్‌లో గండిపడగా మరమ్మతుల కోసం ఇప్పుడు నిధులను మంజూరు చేశారని, ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయో, వరదకాలువకు నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదని, అప్పటి వరకు తాము నష్టపోవాల్సిందేనా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరదకాలువకు రివర్స్‌పంపింగ్ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నందున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా రైతులు ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం రివర్స్‌పంపింగ్ ద్వారా వరదకాలువను నింపి రైతులను ఆదుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.