సిద్దిపేట, మార్చి 17: ‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్క సారిగా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించడంతో బీజేపీ నాయకుల మొఖాలు బిత్తరపోయాయి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారా? చేయ రా? గిల్లి కజ్జాలు.. కొట్లాటలు పెట్టుకోవడం.. అబద్ధాన్ని వందసార్లు చెబితే, నిజమైతదన్న రీతిలో తప్పుడు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారింది.. దీనిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధ్యక్షులు, యువజన విభాగం నాయకులైన మీపై ఉన్నది’అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట మండలం ఇర్కోడ్‌లో నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు మండలాల టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశఃలో మంత్రి మాట్లాడారు. ‘నిరుద్యోగులకు మేమే అండ అని చెప్పుకొంటున్న బత్తాయిలు ఎక్కడపోయారు? మీరు ఇచ్చే ఉద్యోగాల సంగతి ఏంది? ఖాళీలు ఉన్న ఉద్యోగాలు వేయరు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతారు’ అని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారని, ఈ వాస్తవాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో తెలియపర్చాలని పార్టీ శ్రేణులను మంత్రి కోరారు. రాజకీయాల్లో ఎదగాలంటే యువజన విభాగం ముఖ్యమైందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మన పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో గెలిస్తే ఉచిత కరెంట్ ఇస్తామని కాపీ కొట్టారన్నారు. తెలంగాణకు ఏమి చేయకున్నా, ఫేక్ ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుల తీరును తిప్పి కొట్టాలని యువజన విభాగం నాయకులకు పిలుపునిచ్చారు. విభజన చట్టంలో చెప్పిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీరు ప్రాజెక్టుకు జాతీయ హోదా.. ఇలా ఏదీ ఇవ్వలేదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగులకు అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకొనేలా తెలియజేయాలన్నారు. గతంలోనూ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు సిద్దిపేటలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లతోపాటు ఉచితంగా కోచింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడి కోచింగ్‌తో జిల్లాలో 218 మంది కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది ఎస్సైలుగా, 221 మంది గ్రూప్ -2 ఉద్యోగాలు, 36 మంది టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. ఈ సారి సిద్దిపేటలో ఉచిత కోచింగ్‌ను అందిస్తామని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.