హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నేపథ్యంలో విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు ఈ నెల 21న కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఎప్ సెట్ పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ఉదయం 10 గంటలకు సాయంత్రం వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభిస్తారని ఉన్నత విద్యామండ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు.
ఏం తెలుసుకోవచ్చంటే..
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ సదస్సుకు హాజరుకావొచ్చు. ఈ సదస్సుకు వచ్చిన వారికి ఎప్ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ, బ్రాంచి, కాలేజీ సెలెక్షన్, కోర్ బ్రాంచిల ప్రాముఖ్యత, ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలో కోర్ బ్రాంచీల్లో విద్యార్థులు అంతగా చేరడంలేదు. అంతా కంప్యూటర్ సైన్స్ బాటపడుతున్నారు. దీంతో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలు అంపశయ్యపై వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్ బ్రాంచీలకు డిమాండ్ పెంచేందుకు, విద్యార్థులు అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ద్వారా ప్రయత్నించనున్నారు. ఎప్ సెట్ పరీక్షలను ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మే 11న ఎప్ సెట్ ట్ ఫలితాలను విడుదల చేశారు. జూలైలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.
పరిశ్రమ నిపుణులొస్తారు..
ఈ సదస్సులో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలకున్న ప్రాధాన్యతను వివరిస్తారు. కోర్ కోర్సుల్లో చేరడం వల్ల ప్రయోజనాలు, ఉద్యోగావకాశాలపై ఆయా పరిశ్రమల నిపుణులు వచ్చి అవగాహన కల్పిస్తారు. జేఎన్టీయూ కోర్ బ్రాంచీల హెచ్ వో డీలు సైతం ఈ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలను నివృత్తిచేస్తారు. సహజంగా ప్రైవేట్ కన్సల్టెన్సీలు, మీడియా సంస్థలు ఏటా ఎడ్యుకేషన్ ఫేయిర్స్ ను నిర్వహిస్తుంటాయి. విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటాయి. అయితే ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూలు తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.