Telangana | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అటానమస్ కాలేజీలు.. వీటినే స్వయంప్రతిపత్తి గల కాలేజీలంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది. వీటిలో ఇంజినీరింగ్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలుండగా, అత్యధికంగా ఇంజినీరింగ్ కాలేజీలే అటానమస్ హోదాను కలిగి ఉన్నాయి. జాతీయంగా 438 ఉండగా, 16శాతం కాలేజీలు తెలంగాణలోనే ఉన్నాయి. 64 కాలేజీలతో మహారాష్ట్ర, 42 కాలేజీలతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ హోదా పొందగా, ఈ గడువు 2032 వరకు ఉంది. జేఎన్టీయూ జగిత్యాల న్యాక్ ఏ గ్రేడ్ సొంతం చేసుకోవడంతో 2023లో అటానమస్ హోదా దక్కించుకుంది. దీనికి 2033 వరకు గడువు వుంది. రాష్ట్రంలోని అటానమస్ హోదా గల వాటిలో ఓయూ, జేన్టీయూ జగిత్యాల మినహా 70 ప్రైవేట్ కాలేజీలే కావడం గమనార్హం.
కళాశాల, విద్యాసంస్థలు న్యాక్ ‘A’ గ్రేడ్ లేదా, కనీసం మూడు కోర్సులు 675 స్కోర్‌తో ఎన్బీఏ గుర్తింపు కలిగి ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అటానమస్ హోదాను కల్పిస్తున్నది. ప్రస్తుతం 10 ఏండ్ల వరకు అటానమస్ హోదాను కల్పిస్తున్నారు. విద్యాసంస్థలు పదిహేనేండ్ల పాటు ఈ హోదా దక్కించుకుంటే, ఆయా కాలేజీలకు శాశ్వత అటానమస్ హోదాను కల్పించేలా ఇటీవలే యూజీసీ మార్గదర్శకాలు రూపొందించింది. దీంతో విద్యాసంస్థలు సొంతంగా ప్రవేశాల నిబంధనలు రూపొందించి అమలుచేసుకోవచ్చు. ఇవి సొంతంగానే పరీక్షలు నిర్వహించుకుంటాయి. ఆయా కాలేజీల్లోనే ముల్యాంకనం చేస్తారు. కొత్త కోర్సులు, వాటి నిర్వహణ సంబంధిత కాలేజీలే చూసుకుంటాయి. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ పరీక్ష పేపర్ల తయారీ, ఫలితాలు కూడా అవే ప్రకటిస్తాయి. వీటిపై ప్రభుత్వం, వర్సిటీల ఆజమాయిషీ అంతంత మాత్రమే. పూర్తిగా స్వయంప్రతిపత్తితో నడుచుకునే వీలు ఆయా కాలేజీలకుంటుంది.