చొప్పదండి, ఏప్రిల్ 17: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ ఉసురుతీసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి మండల కేంద్రానికి చెందిన గోపాల అనిల్ (30) కొన్నేండ్లుగా ఆటో నడుపుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల క్రితం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో ఆటోలో ప్రయాణికులు ఎక్కకపోవడంతో గిరాకీ తగ్గిపోయింది. అప్పటినుంచి అప్పులు తెచ్చి కిస్తీలు కట్టాడు. అదీగాక నెల క్రితం ఆటోను అమ్ముకున్నాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. బుధవారం చొప్పదండి పట్టణంలో అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.