కోనరావుపేట, జూలై 4: కాంగ్రెస్ సర్కారు తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో ఓ ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయాడు. గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆరు నెలలుగా నరకయాతన అనుభవించాడు. ఈఎంఐలు కట్టకపోవడంతో ఆటోను ఫైనాన్స్ కంపెనీవారు లాక్కెళ్లడం, సమస్యలన్నీ చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
సామనపల్లి స్వామి (38) ఎనిమిదేండ్లుగా ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి రాజయ్య గల్ఫ్‌లో మృతిచెందాడు. తల్లి మైసవ్వ (దివ్యాంగురాలు), భార్య పద్మ, కొడుకు శ్రీహన్స్ (17 నెలలు)తో కలిసి జీవిస్తున్నారు. ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న స్వామికి, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు స్కీంతో ఉపాధికి దెబ్బపడింది. ఆరు నెలలుగా ఆటో నడవక, నెలవారీ ఫైనాన్స్ కట్టలేకపోయాడు.
ఈఎంఐలు కట్టకపోవడంతో ఇటీవలే ఫైనాన్స్ సిబ్బంది ఆటోను లాక్కెళ్లడంతో కుంగిపోయాడు. భార్య పద్మ అనారోగ్యం బారినపడడంతో మరింత అప్పుల్లో కూరుకుపోయాడు. చికిత్స తర్వాత ఆమె తల్లిగారి ఊరు చందుర్తి మండలం బండపల్లిలో ఉంటుండగా, బుధవారం ఆమెను చూసివచ్చాడు.
రాత్రి తల్లి మైసవ్వకు అన్నంపెట్టి ఇంటి ముందున్న జామచెట్టుకు ఉరేసుకున్నాడు. స్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని వివిధ పార్టీల నాయకులతో పాటు ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.