Telangana | అధికారంలోకి వస్తే ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం ఆటో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 రోజులపాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 21న మహాధర్నా నిర్వహించబోతున్నారు. అప్పటి వరకు రోజుకో నిరసనతో ప్రభుత్వంలో చలనం తెప్పించాలని నిర్ణయించారు.
అందులో భాగంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఇమ్లీబన్ బస్టాండ్, నాచారం ప్రాంతాల్లో ఆటో జేఏసీ ప్రతినిధులు భిక్షాటన చేపట్టారు. బస్సుల్లోనూ భిక్షాటన చేస్తూ తమ సమస్యలను ప్రయాణికులకు వివరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ బతుకులను రోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల బతుకులను రోడ్డుకీడ్చిందని తెలంగాణ ఆటో జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇమ్లీ బస్టాండ్, నాచారం ఏరియాలో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు. పలువురి దగ్గరికి వెళ్లి సమస్యలను వివరించారు. అనంతరం ఆటో జేఏసీ ప్రతినిధులు హబీబ్, శ్రీనివాస్, పల్లెర్ల రవి, పెంటయ్య, సంతోష్, సాయిలు మాట్లాడుతూ.. బతుకు ఎలాగూ నాశనం చేశారు.. కనీసం భిక్షాటన చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ సర్కార్ బెదిరిస్తున్నదని ఆరోపించారు.
ఆటో డ్రైవర్ల సహనాన్ని పరీక్షించొద్దని.. తమను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఎంఎస్ రవిశంకర్ మాట్లాడుతూ.. ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసేలేదని విమర్శించారు. ఆటో డ్రైవర్ల కష్టాలను రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. 12 రోజుల నిరసనలో భాగంగా తొలిరోజు భిక్షాటన చేపట్టామని తెలిపారు. ఈ నెల 21న మహాధర్నా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.