హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఎన్నికల మ్యానిఫెస్టో హామీలు అమలుచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను దగా చేస్తున్నదని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ల జేఏసీ నేతలు ఆరోపించారు. పెండింగ్ సమస్యలు పరిషరించాలని ఖైరతాబాద్ ఆర్టీఏ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ బీ వెంకటేశం మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లను మోసం చేస్తే ఊరుకునేది లేదని, నిరవధిక ఆటోబంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా 13 ఏండ్లుగా ఆటో మీటర్ చార్జీలు పెంచలేదని తెలిపారు. జేఏసీ నాయకుడు రూప్సింగ్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సలీం మాట్లాడుతూ.. ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడుస్తున్న టూవీలర్లను నిషేధించాలని కోరారు. మారయ్య మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పరిధిలో జీవో 263 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన 20 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని కోరారు. ప్రవీణ్, శ్రీనివాస్, సత్తిరెడ్డి, అశోక్, జంగయ్య, ఒమర్‌ఖాన్, కృష్ణ, నరసింహ, రామ్‌కిషన్, లింగంగౌడ్, మొబిన్ తదితరులు పాల్గొన్నారు.