హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ): కాంగ్రెస్ పాలనలోనే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు చూస్తున్నామని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆటోడ్రైవర్ల సమస్యలపై సదస్సు నిర్వహించారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ డ్రైవ ర్ల సమస్యలను పరిష్కరించటంలో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చిన అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ఇప్పటివరకు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చలాన్లతో, మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియర్లు డ్రైవర్లను వేధిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 13, 14న ఆటో డ్రైవర్ల భిక్షాటన, 15, 16, 17న సోషల్ మీడియాలో డ్రైవర్ల సమస్యలపై పోస్టులు, 18, 19, 20న మండల కేంద్రాల్లో ధర్నాలు, 21న హైదరాబాద్‌లో మహాధర్నా, 22, 23, 24న ఎమ్మెల్యే, ఎంపీలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో బీపీటీఎంఎం, టీఏటీయూ, ఎన్టీఏడీ యూ, టీఏఎల్కేఎస్ నాయకులు పాల్గొన్నారు.