హైదరాబాద్ సిటీబ్యూరో/హిమాయత్‌నగర్/కొణిజర్ల/మునగాల ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏడాదికి 12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలను నట్టేట ముంచిందని ఆటోడ్రైవర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఆటోడ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. బీఆర్టీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, సీఐటీయూ, ఐఎఫ్టీఐ తదితర సంఘాల నాయకులు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం పథకంతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీ మేరకు 8 లక్షలమంది ఆటో డ్రైవర్లకు 12వేల చొప్పున మొత్తం 960 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సీఎం రేవంత్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరిస్తామంటూ మాటతప్పడం మంత్రి పొన్నం అలవాటుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజరలో పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దహనం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలోని గణపవరం ఎక్స్‌రోడ్డులో ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. హామీలు నెరవేర్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది. రాను న్న అసెంబ్లీ సమావేశాల్లో ఆటోకార్మికులకు బడ్జెట్ కేటాయించాలి. ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలను సీఎం రేవంత్ ఆదుకోవాలి. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. 50 ఏండ్లు నిండిన ఆటోడ్రైవర్లకు పింఛన్లు మంజూరు చేయాలి.
– మారయ్య, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు