హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని రేవంత్ సర్కారు ఇచ్చిన హామీ ఏడాదిన్నర గడిచినా అమలు కాకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పిట్టల్లా రాలుతున్నారు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ సాధిక్ (28) గిరాకీ లేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక తమను ప్రభుత్వం పట్టించుకోదనే బాధతో గురువారం లోటస్‌పాండ్‌లో ఆటోను రోడ్డుపక్కన నిలిపి ఓ చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఇల్లు కిరాయి, ఇంటి ఖర్చులు, అప్పులతో సతమతమై చివరికి ప్రాణం తీసుకున్నాడు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సాధిక్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల కొత్తగూడేనికి చెందిన దుర్గాప్రసాద్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిన్నరగా సర్కారు నిర్లక్ష్యంతో సుమారు 125 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉచిత బస్సు పథకం తమ ప్రాణాలు తీస్తున్నదని ఎంత మొత్తుకున్నా రేవంత్ సర్కారు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆటో యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని బీఆర్టీయూ ఆటో యూనియన్, బీఎంఎస్ తదితర సంఘాల నాయకులు వేముల మారయ్య, రవిశంకర్ డిమాండ్ చేశారు. పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే తమకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదేనని తేల్చిచెప్పారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోడ్రైవర్లతో చాలాసార్లు చర్చలు జరిపారని, అవన్నీ ఉత్తవేనని తెలిపారు. ఏడాదికి రూ.12 వేలు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీల అమలు అడిగితే తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు ఉంటే వారి కుటుంబ సభ్యులంతా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.