వెంగళరావునగర్, డిసెంబర్ 21: కనిపెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులుగా మార్చింది. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమర్చారు. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఓ కుమార్ (30) ప్రేమవివాహం చేసుకొన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కూతురుతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. ఏడో తరగతి చదువుతున్న కారు డ్రైవర్ కూతురును ఆటోడ్రైవర్ కుమార్ ట్రాప్ చేసి గత తీసుకెళ్లి యూసఫ్‌గూడలోని ఓ గదిలో నిర్బంధించాడు. లైంగికదాడికి యత్నించగా ఆ బాలిక తప్పించుకొని వెళ్లింది. బాలానగర్ పోలీసులకు కనిపించిన ఆ బాలికను విచారిస్తే తాను అనాథనని చెప్పడంతో వారు నింబోలిఅడ్డలోని హోంకు తరలించారు. ఈ సమయంలో ఆ బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈలోగా కరోనా సమయంలో ఆ బాలికకు ఇప్పించిన ల్యాప్‌ట్యాప్‌ను పరిశీలించగా, స్నాప్‌చాట్‌లో ఉన్న ఓ ఫోన్ నంబర్‌ను గుర్తించగా, అది కుమార్‌దని తెలిసింది.
కూతురు కోసం తల్లి హనీట్రాప్
ఎలాగైనా కుమార్ అనే యువకుడే తన కూతురును కిడ్నాప్ చేశాడని ఆ తల్లిదండ్రులు భావించారు. దీంతో ఆ బాలిక తల్లి స్నాప్‌చాట్‌లో ఓ ఐడీని క్రియేట్ చేశారు. ఆమె హనీట్రాప్ చేసి ఆ యువకుడిని మియాపూర్ రప్పించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కుమార్‌ను పట్టుకొని కొట్టి కారులో కిడ్నాప్ చేశారు. నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి తన కూతురు సమాచారం చెప్పాలని నిలదీశారు. తన నుంచి తప్పించుకోపోయిన విషయాన్ని చెప్పాడు. దీంతో వారి దెబ్బలకు తాళలేక ఆ యువకుడు అప్పస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కారులో సూర్యాపేట వైపు తీసుకెళ్లి పెద్ద బండరాయిని కాళ్లు, చేతులకు కట్టిపడేసి నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి సజీవంగానే తోసేశారు. దీంతో బొరబండ పోలీస్‌స్టేషన్‌లో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ తర్వాత కారు డ్రైవర్ కూతురు తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నది. అయితే కుమార్ ఆటోను ఆ కారు డ్రైవర్ వాడుతుండగా, కుమార్ బంధువులు ఆటో బంపర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసుల ద్వారా గుర్తు తెలియని డెడ్‌బాడీ డీఎన్ఏ కోసం ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఆటో డ్రైవర్ హత్యోదంతంలో బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.