కరీంనగర్ తెలంగాణచౌక్, మార్చి 28: ఆటో నడువక.. ఇల్లు గడువక ఆటో డ్రైవర్ మనోవేదనతో గుండెపోటుకు గురై మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంసుభాష్నగర్కు చెందిన నీలి మల్లేశం (50) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి భార్య, కొడుకు, కూతురితోపాటు వృద్ధురాలైన తల్లి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకంతో గిరాకీ లేక కొద్దిరోజులుగా సతమతమవుతున్నాడు. శనివారం తన కూతురిని ఆటోలో పదోతరగతి పరీక్ష కేంద్రం వద్ద దింపాడు. కిరాయిల కోసం వెళ్తుండగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే అతడి స్నేహితులు ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆటో డ్రైవర్ మల్లేశం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ జిల్లా ఇన్చార్జి మద్దెల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో కుటుంబాలను పోషించుకోలే డ్రైవర్లు మనోవేదనతో చనిపోతున్నారని అన్నారు. మల్లేశం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.