సైదాబాద్, మే 12: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో ఆటోడ్రైవర్ తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన అన్యపాక నాగరాజు (32) సైదాబాద్ చింతల్లో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నది.
ఇటీవలే అవి మరింతగా పెరిగి భార్యాభర్తల నడుమ వివాదం చోటుచేసుకోవడంతో రాణి పుట్టింటికి వెళ్లింది. ఆర్థిక ఇక్కట్లతో నాగరాజు మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.