కంది, అక్టోబర్ 19: ఆర్థిక ఇబ్బందులు భరించలేక కంది కిసాన్‌సాగర్ చెరువులో దూకి ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్‌రెడ్డి వివరాల ప్రకారం.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన డప్పు బాలరాజు (38) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతడికి భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సర్కారు తెచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో నడవక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన బాలరాజు ఈ నెల 17న రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చెరువులో తేలిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.