గీసుగొండ, నవంబర్ 2: గిరాకీ లేక అప్పులపాలై ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్ల శివారు గోపాల్రెడ్డినగర్లో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్రెడ్డినగర్కు చెందిన ఇప్ప నాగరాజు (23) ఏడాది క్రితం అప్పు చేసి కొత్త ప్యాసింజర్ ఆటో కొనుగోలు చేశాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ పడిపోయింది. దీంతో ఆటోకు ఫైనాన్స్‌లో తెచ్చిన రూ.2.50 లక్షలు అప్పు చెల్లించకపోవడంతో ఇటీవల ఫైనాన్స్ కంపెనీ వారు ఇంటికి వచ్చి నిలదీశారు. నాగరాజుపై ఒత్తిడి పెరగడంతో అప్పులు మీర్చే మార్గం లేక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.