హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని జాతీయ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రమణియన్ వెల్లడించారు. ఈ కేసులో బాధితులు ఢిల్లీకి వచ్చి ఇచ్చిన ఫిర్యాదుపై తమ నిజనిర్ధారణ కమిటీ వచ్చి దర్యాప్తు జరిపిందని, నాడు జైళ్లలో ఉన్న బాధితుల నుంచి వివరాలు తీసుకున్నదని తెలిపారు. ఈ కేసులో నిజాలు నిర్ధారణ అయితే.. నిందితులపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. ఎంసీహెచ్ఆర్డీలో రెండ్రోజులపాటు జరిగిన బహిరంగ విచారణ మంగళవారం ముగిసిన తర్వాత ఆయన, ఇతర సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఫుడ్‌పాయిజనింగ్ ఘటనలను కమిషన్ తీవ్రంగా పరిగణించిందని, విద్యార్థుల మరణాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
తెలంగాణలో మొత్తం 780 ఎన్హెచ్ఆర్సీ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు జస్టిస్ సుబ్రమణియన్ చెప్పారు. రెండు రోజుల్లో 109 కేసులు విచారణకు వచ్చాయని వాటిలో దవాఖానల్లో అగ్నిప్రమాదాల కారణంగా పిల్లలు చనిపోవడం, ఆదిలాబాద్‌లో గిరిజన మహిళల అక్రమ రవాణా, ఆదివాసీ కుటుంబాల నిర్బంధం వంటి కేసులు, ధన్వాడ బాధితుల ఆవేదనలు, పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోవడం వంటి ఘటనలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన కేసులలో ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు.
పలు కేసులను పూర్తిగా విచారించిన కమిషన్ 9 కేసులలో రూ.49.65 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. 109 కేసులలో 22 కేసులు మహిళలు, చిన్నారులకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు. సమావేశం అనంతరం కమిషన్ చైర్మన్, సభ్యులు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా, తదితర అధికారులతో సమావేశమై.. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ సభ్యులు జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, జస్టిస్ విజయ భారతి సయాని, తెలంగాణ హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని డీజీపీ జితేందర్ జాతీయ మానవ హకుల కమిషన్‌కు వివరించారు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్, సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. తెలంగాణలో మహిళల భద్రత కోసం అదనపు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తున్నదని, షీ టీమ్స్, భరోసా కేంద్రాల ద్వారా భద్రతపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని, మహిళలను ఇబ్బంది పెడుతున్న ఈవ్‌టీజర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపీ చారుసిన్హా మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా 31 భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆపరేషన్ ముసాన్, ఆపరేషన్ స్మైల్ లాంటి కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్నామని చెప్పారు.