హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని పేర్కొన్నట్టు గుర్తుచేశారు. సాంఘిక, ఆర్థిక సవాళ్లను ఎదురొనే క్రమంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేస్తుందని వివరించారు. 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న వాద ప్రతివాదనలకు జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలని కాంక్షించారు.
కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్లు 50% కంటే ఎకువగా ఉండొద్దన్న తీర్పును ఆధారంగా చేసుకొని, బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వ్యయ ప్రయాసలతో నిర్వహించిన ఇంటింటి సర్వే బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ అడ్డుకోవడం సరికాదని అన్నారు. రాజకీయ కారణాలతో బీసీ బిల్లులను 9వ షెడ్యూలులో పెట్టకపోవటం దురదృష్టకరమని, ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసే చర్యగా భావించాల్సి వస్తుందని అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసి ఈ దశలో బీసీ రిజర్వేషన్లపై అస్త్ర సన్యాసం సరికాదని పేర్కొన్నారు. 50% రిజర్వేషన్లు కంటే మించవద్దని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును చాలెంజ్ చేసి ఏడుగురు జడ్జిల విసృ్తత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపి, బీసీలకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాలని ప్రభుత్వానికి సూచించారు.