మహబూబ్‌నగర్, నవంబర్ 3: పార్కులో ఆడుకుంటున్న బాలికపై పట్టపగలే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి వదిలేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని పిస్తాహౌస్ సమీపంలో ఉన్న పార్కులో బాలిక(3).. తోటి బాలబాలికలతో కలిసి ఆడుకుంటున్నది. పిస్తాహౌస్‌లో పనిచేస్తున్న వెస్ట్‌బెంగాల్‌కు చెందిన రిజ్వాన్ ఆదివారం మధ్యాహ్నం 1:20 నిమిషాల సమయంలో బాలికను పక్కకు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. గమనించిన తోటి పిల్లలు రోడ్డుపై వెళ్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థులకు చెప్పారు.
రిజ్వా న్ బాలిక గొంతు నులిమే ప్రయత్నం చేస్తుండగా.. మెడికల్ విద్యార్థులు బాలికను రక్షించారు. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఘటనపై యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు వచ్చి రిజ్వాన్‌ను స్టేషన్‌కు తరలించారు. అయినా.. కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేశారు. పైగా నిందితుడికి మతిస్థిమితం లేదని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయం జిల్లా కేంద్రమంతటా వ్యాపించడంతో పోలీసులు సాయంత్రం 6 గంటల తర్వాత బాధితులను స్టేషన్‌కు పిలిపించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు రూరల్ సీఐ గాంధీనాయక్ తెలిపారు.