Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 5: అధికార పార్టీ అండతో కొందరు వ్యక్తులు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 10 పక్కన దాదాపు రూ.300 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. దీనిపై నిరుడు డిసెంబర్లో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, జలమండలి ఉన్నతాధికారులు 40 రోజుల క్రితం ఎట్టకేలకు ఆ స్థలాన్ని కబ్జాకోరుల నుంచి విడిపించారు. దీంతో గత నెలరోజుల నుంచి మౌనంగా ఉన్న కబ్జాదారులు మరోసారి ఆ స్థలంలో తిష్టవేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పీలో 16 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. అందులో జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాలు సహా మొత్తం 5 ఎకరాలను బోగస్ డాక్యుమెంట్లతో కాజేసేందుకు పార్థసారధి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అక్కడ లేని సర్వే నంబర్‌ను తీసుకొచ్చి, ఆ స్థలం తనదేనంటూ ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో అతనిపై గతంలోనే ఫోర్జరీ, కబ్జా కేసులు నమోదయ్యాయి. ఆ స్థలంపై శ్రీ రాధికా కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీతోపాటు మరికొందరు వేసిన కేసులపై కోర్టులు విచారణ జరుపుతున్నాయి. అయినప్పటికీ గత డిసెంబర్లో పార్థసారథి, ఆయన అనుచరులు ఆ స్థలంలో ప్రవేశించి, చుట్టూ రేకుల షెడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వారం రోజులు అక్కడే తిష్ట వేశారు. దీన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, జలమండలి అధికారులను ఆదేశించడంతో అక్రమణలను తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
మరోసారి ప్రయత్నం
ఆ స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని ప్రయత్నిస్తున్న పార్థసారథి 3 రోజుల క్రితం తన అనుచరులను మరోసారి రంగంలోకి దించాడు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డుల్లో కొన్నింటిని తొలగించి, బంజారాహిల్స్‌కు చెందిన కొందరు రౌడీలను కాపలా పెట్టాడు. ఆ స్థలంలో ఓ గదిని నిర్మించడంతోపాటు టెంట్లు వేసి వంటావార్పు ప్రారంభించాడు. ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని, తమకు ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని, అనవసరంగా లోనికి వచ్చి కష్టాలు తెచ్చుకోవద్దని బెదిరిస్తున్నాడు. గతంలో ఆ స్థలం కబ్జాపై షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీంతో పోలీస్ శాఖ నుంచి తమకు మద్దతు ఉన్నదన్న ధైర్యంతో ఆక్రమణదారులు మరోసారి ఆ స్థలాన్ని కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆక్రమణల తొలగింపు
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి స్పందించారు. ఆ స్థలంలోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని బుధవారం రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఆర్ఐ భాను, ఇతర సిబ్బంది వెళ్లి ఆ స్థలంలోని గదిని కూల్చేశారు. టెంట్లను పీకేశారు. వాచ్‌మెన్‌ను, అక్కడ పెంచుతున్న కుక్కలను వెళ్లగొట్టారు. రెవెన్యూ సిబ్బంది రాకను గమనించిన రౌడీలు ముందే అక్కడి నుంచి జారుకున్నారు. ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు పదే పదే ప్రయత్నిస్తున్న పార్థసారధి, అతని అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదుచేసి అరెస్టు చేస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.