హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి ఘటనలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనయుడు, కో బ్రదర్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. దాడి జరిగిన రోజు ఎమ్మెల్యే గాంధీతోపాటు 15మందిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న గాంధీ తనయుడు, కో బ్రదర్‌పై కేసులు నమోదు చేయలేదు.
బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై భగ్గుమనడం తో దిగివచ్చారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే గాంధీ తనయుడు, కో-బ్రదర్‌పై 109 (1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2) రెడ్‌విత్ 190బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
దాడి జరిగిన రోజు నుంచీ ఇప్పటి వరకు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ కుమారుడు, కో బ్రదర్ కనిపించలేదా అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వారిపై అదే రోజు కేసులు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డాయి. దాడి ఘటనలో నిందితులను తప్పించడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆలస్యంగానైనా పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.