హైదరాబాద్, జూన్ 21 (నమస్తేతెలంగాణ): తమ నోటికాడి బువ్వ గుంజుకోవద్దని ప్రాధేయపడ్డ బూర్గంపాడు గిరిజన మహిళలను చీరలు చింపి కొట్టడం దుర్మార్గమని, సీఎం రేవంత్‌రెడ్డి అధికార మదానికి, నిరంకుశ విధానానికి, రాక్షస మనస్తత్వానికి, నైతిక పతనానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండిలో గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారుల అమానుష దాడిని కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు.
రేవంత్ ప్రైవేట్ సైన్యంలా మారిన అటవీశాఖ అధికారులు మహిళలను వివస్త్రలను చేసి దాడికి దిగడం దారుణమని మండిపడ్డారు. ఆడబిడ్డల ఆత్మగౌరవంపై దాడి కాంగ్రెస్ సర్కారు అనాగరిక చర్యలకు పరాకాష్ట అని అభివర్ణించారు. భూముల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టాలనుకోవడం ప్రజాస్వామిక స్ఫూర్తికి పాతరేయడమేనని విరుచుకుపడ్డారు.
తనను ప్రశ్నించిన మహిళలను వివస్త్రలను చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి పాలనలో ఇలాంటి దారుణాలే జరుగుతయి..ఒక గూండా సీఎం సీటులో కూర్చుంటే ప్రజాస్వామ్యం నిరంకుశంగా మారుతది.
-కేటీఆర్
రాహుల్ నేతృత్వంలో రేవంత్ కనుసన్నల్లో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి కొనసాగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిపై బుల్డోజర్లను ఉసిగొల్పడం రేవంత్ సర్కారుకే చెల్లిందని, కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తానికి బదులు బుల్డోజర్ను పెట్టుకోవాలని చురకలంటించారు. మానవీయ విలువలకు ఘోరీ కట్టిన ఇరవైండి ఘటనపై రాహుల్, ఖర్గే క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని అభయమిచ్చారు. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్‌గాంధీ ప్రవచిస్తున్న న్యాయం, సమానత్వమంటే అమాయకులైన గిరిజన మహిళలను వివస్త్రలను చేయడం.. వారిపై దాడులకు దిగడమేనా? రాహుల్ నేతృత్వంలో.. రేవంత్ కనుసన్నల్లో రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతి కొనసాగుతున్నది. ప్రశ్నిస్తున్న వారిపైకి బుల్డోజర్లను ఉసిగొల్పడం రేవంత్ సర్కారుకే చెల్లింది. అందుకే కాంగ్రెస్ పార్టీ హస్తానికి బదులు బుల్డోజర్ను గుర్తుగా మార్చుకోవాలి.
-కేటీఆర్